Aug 30,2023 23:15

ప్రజాశక్తి - ఏలూరు
             ప్రజలపై అధిక ధరల భారాన్ని మోపి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బిజెపి ప్రభుత్వం ఘోరంగా మోసగించిందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై సిపిఎం చేపట్టిన సమరభేరి ఏలూరు నగరంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక చేపల తూము సెంటర్‌లో సిపిఎం నగర కార్యదర్శి పి.కిషోర్‌ అధ్యక్షతన జరిగిన సభలో రవి మాట్లాడారు. 2014లో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి నిత్యావసర సరుకుల ధరలన్నీ ఆకాశాన్నంటుతున్నాయని విమర్శించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధర రూ.120కు చేరిందన్నారు. గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1200కు పెరిగిందన్నారు. అయితే గ్యాస్‌ ధర రూ.200 తగ్గిస్తున్నట్లు ప్రకటించారని, ఇది వాతపెట్టి పూత పూసినట్టు ఉందన్నారు. రూ.400 ఉన్న సిలిండర్‌ ధర రూ.1200కు పెంచి ఎనిమిదేళ్ల తర్వాత రూ.200 తగ్గించడం సిగ్గుచేటని విమర్శించారు. బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి మత విద్వేషాలు రేపుతోందని, దానికి తాజాగా మణిపూర్‌, హర్యానాలో జరిగిన అల్లర్లే ఉదాహరణ అని అన్నారు. మనరాష్ట్రానికి అన్యాయం చేసిన బిజెపికి వైసిపి, టిడిపి ఎంపీలు పార్లమెంట్‌లో మద్దతు పలుకడం సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం కూడా ఇంటి పన్ను, నీటి, చెత్త పన్నులు, విద్యుత్‌ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తుందని విమర్శించారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ నెల 28వ తేదీ నుండి వచ్చేనెల నాలుగో తేదీ వరకూ సమరభేరి ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి.సోమయ్య, పి.ఆదిశేషు, వి.సాయిబాబు, బి.జగన్నాధరావు, ఎస్‌.సత్యనారాయణ, ఎం.ఇస్సాకు, ఏసుబాబు, మీసాల సత్యం, జి.కోటేశ్వరరావు, జె.గోపి, గౌడ రవీంద్ర, సీతారాం, ప్రధాన్‌, షేక్‌ కరీముల్లా, షేక్‌ సైదాని పాల్గొన్నారు.
నిడమర్రు:మండలంలోని అడవికొలనులో సిపిఎం సమరభేరిలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రచురించిన కరపత్రాలు పంచుతూ సంతకాలు సేకరించారు. అనంతరం స్థానిక సచివాలయం వద్ద ధర్నా చేసి అధికారులకు వినతిని అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నారపల్లి రమణారావు, కోన శ్రీనివాసరావు, గవర సత్యనారాయణ, లావేటి చంద్రరావు, కె.పద్మారావు, లావేటి సోంబాబు, నక్క వెంకటేశ్వరరావు, వెలగలేటి మోహన్‌ పాల్గొన్నారు.