Mar 02,2023 23:29

తగరపువలసలో నిరసన తెలుపుతున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి -యంత్రాంగం
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెంచిన గ్యాస్‌ ధరలకు వ్యతిరేకంగా విశాఖ జిల్లా వ్యాప్తంగా గురువారం నిరసనలు హోరెత్తాయి. పలుచోట్ల కట్టెలతో వంట చేసిన నిరసన తెలిపారు.
తగరపువలస : సిపిఎం ఆధ్వర్యాన స్థానిక మార్కెట్‌ జంక్షన్‌ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జోన్‌ కార్యదర్శి రవ్వ నరసింగరావు మాట్లాడుతూ, ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియగానే వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను కేంద్ర ప్రభుత్వం రూ.50 పెంచిందన్నారు. పెంచిన వంట గ్యాస్‌ ధరను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వి.నాగరాజు, ఎస్‌.శ్రీనివాసవర్మ, కొత్తయ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీతమ్మధార : తాటిచెట్లపాలెం జంక్షన్‌, ఎఎస్‌ఆర్‌ కాలనీలో సిపిఎం ఆధ్వర్యాన నిరసన తెలిపారు. గ్యాస్‌ బండని పక్కన పెట్టేసి కట్టెల పొయ్యితో వంట చేసుకునే రోజులు వచ్చాయని తెలుపుతూ వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం అక్కయ్యపాలెం జోన్‌ కన్వీనర్‌ రాజు, నాయకులు కెఎస్‌.కుమార్‌, గౌరీష్‌ మాట్లాడుతూ, ఇప్పటికే పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలపై మరో గుది బండ మాదిరిగా గ్యాస్‌ ధరలు పెంపు ఉందని విమర్శించారు. బిజెపి అధికారంలోకి వచ్చాక రూ.400 ఉండే గ్యాస్‌ ధరను నేడు రూ.1111 కు పెంచిందని విమర్శించారు. చిల్లర వర్తకులు వాడే గ్యాస్‌ సిలిండర్‌పై ఏకంగా రూ.350.50 పెంచడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో జోన్‌ నాయకులు ఆర్‌ఎన్‌ మాధవి, జ్యోతి, బి.లక్ష్మీపతి, కె.రమణమూర్తి, చిన్న, గంగ, ఆదిలక్ష్మి, సుందరి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
యస్‌.రాయవరం:కేంద్రం పెంచిన గ్యాస్‌ సిలిండర్ల ధరలను వెంటనే తగ్గించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన అడ్డురోడ్డు కూడలిలో రాస్తారోకో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.సత్యనారాయణ మాట్లాడుతూ, కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటికి రూ.400లు ఉన్న గ్యాస్‌ ప్రస్తుతం రూ.1200లకు చేరిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటుందన్నారు. ఒకపక్క నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. ఈ కార్యక్రమంలో ముఠా కార్మికులు పాల్గొన్నారు.