ప్రజాశక్తి-పెందుర్తి : గ్యాస్ పెంపుదలను నిరసిస్తూ జివిఎంసి 92వ వార్డు పరిధి బంటా కాలనీలో సిపిఎం ఆధ్వర్యాన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జోన్ కార్యదర్శి రమణి మాట్లాడుతూ, కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రజలపై భారాలు వేసే పనిపెట్టుకున్నారని విమర్శించారు. పెట్రోలు, డీజిల్ ధరలను రోజూ పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం అంచెలంచెలుగా గ్యాస్ ధరను పెంచుతూ ప్రజల నెత్తిన భారాలు వేస్తోందన్నారు. బిజెపి ప్రభుత్వానికి అదాని ఆస్తులు పెంచడంలో ఉన్న శ్రద్ధ ప్రజలు, కార్మికులపై లేదన్నారు. రానున్న కాలంలో బిజెపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు అప్పలనాయుడు, ఐద్వా నాయకులు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.