Sep 25,2023 21:11

నిరసన తెలుపుతున్న ఫ్యాప్టో నాయకులు

ప్రజాశక్తి- రాయచోటి : సిపిఎస్‌ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాల్సి ఉండగా అందుకు భిన్నంగా జిపిఎస్‌ విధానాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ మంత్రిమండలి తీర్మానం చేయడాన్ని దారుణమని ఫ్యాప్టో జిల్లా సెక్రటరీ జనరల్‌ రవిశంకర్‌ పేర్కొన్నారు. ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సోమవారం సాయంత్రం అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఫ్యాప్టో జిల్లా సెక్రటరీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఒపిఎస్‌ ముగిసిన అధ్యాయమని ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల జీవన్మరణ సమస్య అయిన పాత పెన్షన్‌ విధానం పట్ల మంత్రి నిర్లక్ష్యంగా మాట్లాడటం ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ఈ ప్రభుత్వానికున్న వైఖరిని తేటతెల్లం చేస్తుందన్నారు. మాట తప్పను, మడమ తిప్పను, విశ్వసనీయత కోల్పోతే పదవిలో కొనసాగను అని పదేపదే వల్లె వేసిన ముఖ్యమంత్రి ఈరోజు చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షలకు భిన్నంగా ఉన్న జిపిఎస్‌ విధానాన్ని అంగీకరించే ప్రశ్నే లేదన్నారు. సిపిఎస్‌ను రద్దుచేసి ఒఎస్‌ను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉద్యమాలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం జిపిఎస్‌ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎస్‌టియు రాష్ట్ర కార్యదర్శి శివా రెడ్డి, యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్‌ జాబిర్‌ మాట్లాడుతూ సిపిఎస్‌కు జిపిఎస్‌ ప్రతిరూపమే తప్ప వేరొకటి కాదన్నారు. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్‌ లేని పాత పెన్షన్‌ విధానానమే తమకు కావాలని, మరో పెన్షన్‌ విధానాన్ని అంగీకరించే ప్రశ్నే లేదన్నారు. సిపిఎస్‌ రద్దు పై హామీ ఇవ్వని అనేక రాష్ట్రాలు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తుంటే, ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఓపిఎస్‌ ను అమలు చేయకపోవడం దేనికి సంకేతమని వారు ప్రశ్నించారు. ఎపిటిఎఫ్‌ (1938) జిల్లా ప్రధాన కార్యదర్శి ఇలియాస్‌, ఎపిటిఎఫ్‌ (257) జిల్లా అధ్యక్షుడు హరి బాబు మాట్లాడుతూ పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని నిరసనలు తెలియజేసినా ఈ ప్రభుత్వం భరించడం లేదన్నారు. ఆందోళనలపై, ఉద్యమాలపై ఉక్కు పాదం మోపుతున్నదని ఆరోపించారు. సాధారణ ధర్నాలకు సైతం పోలీసులు ఇళ్లకు వచ్చి నోటీసులు ఇవ్వటం ఏంటని వారు ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలియజేసే హక్కును కాలరాయడం తగదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఈ ప్రభుత్వానికి తగు బుద్ధి చెప్పే విధంగా కార్యాచరణ తీసుకుంటామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌టియు రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి, రూటా జిల్లా అధ్యక్షులు సబాతుర్‌ రెహమాన్‌, ఎస్‌టియు రాష్ట్ర నాయకులు రవీంద్ర రెడ్డి, యస్‌ ఎ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు గోపాల్‌ ఖాన్‌, ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా నాయకులు శివయ్య, జయన్న, దుర్గేశ్వర రాజు, మునవ్వర్‌, వెంకట రామిరెడ్డి, గోపి, నాగరాజు, వాసుదేవ రెడ్డి,శివా శంకర్‌, ఎపియుఎస్‌పియు రాష్ట్ర కన్వీనర్‌ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.