May 27,2023 22:32

అధికారులకు సూచనలు ఇస్తున్న కలెక్టర్‌ కృతికా శుక్లా


ప్రజాశక్తి - కాకినాడ
జెఎన్‌టియుకె 9వ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఈ నెల 31వ తేదీన రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ కాకినాడ పర్యటనకు వస్తున్నందున పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా సమన్వయ శాఖల అధికా రులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ కోర్టుహాల్‌లో ఎస్‌పి ఎస్‌.సతీష్‌ కుమార్‌, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో కలెక్టర్‌ కృతికా శుక్లా సమావేశం నిర్వహిం చారు. గవర్నర్‌ పర్యటన ఈనెల 31న ఉదయం 10.50 గంటల నుంచి మధ్యాహ్నం 2.45 గంటల వరకు ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో పోలీస్‌ పరేడ్‌ మైదానంలో హెలిప్యాడ్‌, గెస్ట్‌ హౌజ్‌, సభా వేదిక తదితరాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్‌అండ్‌బి, మునిసిపల్‌, రవాణా, రెవెన్యూ, వైద్య ఆరోగ్యం, విద్య తదితర శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్‌ మార్గనిర్దేశనం చేశారు. వేసవి నేపథ్యంలో వేడిమి నుంచి ఉపశమనం కలిగించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భద్రత పరంగా చేస్తున్న ఏర్పాట్లను ఎస్‌పి ఎస్‌.సతీష్‌ కుమార్‌ వివరించారు. ప్రాంగణంలో దాదాపు 1,200 మందికి సిటింగ్‌, ఇతర ఏర్పాట్లు చేస్తున్నట్లు రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎల్‌.సుమలత వివరించారు. సమావేశంలో అడిషనల్‌ ఎస్‌పి పి.శ్రీనివాస్‌, జడ్‌పి సిఇఒ ఎన్‌వివి సత్య నారాయణ, కాకినాడ ఆర్‌డిఒ బివి రమణ, కార్పొరేషన్‌ ఎడిసి సీహెచ్‌ నాగనరసింహారావు, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ ఆర్‌.రమేష్‌, డిఎస్‌పి మురళీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.