Oct 19,2023 23:49

పిడుగురాళ్ల: తెలుగుదేశం పార్టీ హయాంలో గుత్తికొండకి మూడు కోట్ల రూపాయల కేటాయించిందని, వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గ్రామాభివృద్ధికి రూ.51 కోట్లతో అభివృద్ధి చేశామని గురజాల శాసన సభ్యులు కాసు మహేష్‌రెడ్డి అన్నారు. మండ లంలోని గుత్తికొండలో గురువారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేశామని అన్నారు. త్వరలో గుత్తికొండలో ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తామని, పూర్తి చేయాల్సిన రహదారులను కూడా పూర్తి చేస్తామని చెప్పారు. నియోజకవర్గంలోని గ్రామా లన్నింటిని గత ప్రభుత్వం కంటే మెరుగ్గా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమేనని కానీ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా గ్రామాల అభివృద్ధికి, సంక్షేమ పథకాలు అందజేసేందుకు మాత్రమే వినియోగించుకోవాలని అన్నారు. కార్య క్రమంలో తహశీల్దార్‌ చక్రవర్తి, ఎంపిడిఒ కాశయ్య,మాజీ జెడ్పిటిసి సభ్యులు వీరభద్రులు పాల్గొన్నారు.