రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మాసాల పాటు కసరత్తు చేశాక సోమవారం ప్రకటించిన నూతన ఇసుక విధానం కాంట్రాక్టర్‌కు కాసుల పంట పండించేలా వినియోగదారులకు గూబ గుయ్యిమనిపించేలా ఉంది. వైసిపి వచ్చిన 22 మాసాల్లో రెండు కొత్త ఇసుక పాలసీలు తెచ్చి ఆ రంగంలో అనిశ్చితికి కారణమైంది. గత టిడిపి ప్రభుత్వంలో ఇసుక అక్రమాలు జరిగాయని, ఆదాయం ప్రభుత్వ ఖజానాకు కాకుండా నాటి అధికారపక్షం అనుయాయుల జేబుల్లోకి వెళ్లిందని, సరిదిద్దడానికే కొత్త విధానాలని చెబుతోంది. ఆచరణలో ఆ లక్ష్యం కనిపించకపోగా గతంలో ఇసుక దోపిడీ డ్వాక్రా సభ్యుల ముసుగులో వికేంద్రీకరణ జరగ్గా, ఇప్పుడు గంపగుత్తగా ఒకే కాంట్రాక్టు సంస్థ వద్ద దోపిడీ కేంద్రీకృతమవుతోంది. ఇసుక విధానంపై వైసిపి ప్రభుత్వం పలు విన్యాసాలు చేసింది. అధికారంలోకొచ్చిన రెండు వారాల్లోపు ముందటేడు జూన్ మధ్యలో అర్ధంతరంగా ఇసుక తవ్వకాలపై నిషేధం విధించింది. ఇసుక దొరక్క వినియోగదారులు, లక్షలాది నిర్మాణ కార్మికులు పనుల్లేక నానా ఇబ్బందులు పడ్డారు. ఆత్మహత్యలకు సైతం ఒడిగట్టారంటే వారి స్థితిగతులెంతగా ప్రభావితం అయ్యాయో తెలుస్తుంది. 2019 సెప్టెంబర్‌లో తెచ్చిన విధానంలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఎపిఎండిసి ఇసుక త్వకాలు చేపట్టి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నవారికి అందిస్తుందనగా, సర్వర్ ఇబ్బందులు, బోగస్ బుకింగ్‌లతో ప్రహసనమైంది. ఇసుక సమస్యలు తీరకపోగా మరింత పెరిగాయి. ఆన్‌లైన్ పారదర్శకమనగా, బినామీ బుకింగ్‌లై వేలాది టన్నుల ఇసుక మాయమైందని సంబంధిత మంత్రివర్యులే సెలవిచ్చారు.
ఆన్‌లైన్ విధానంపై మంత్రుల కమిటీని వేయగా నిరుడు నవంబర్‌లో ఆఫ్‌లైన్ పాలసీ ముసాయిదాను ప్రజల్లో చర్చకు పెట్టి అభిప్రాయాలు చెప్పమన్నారు. ముసాయిదాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలేవీ ముందుకు రాకపోతేనే తవ్వకాలను ప్రైవేటుకు ఇస్తామన్నారు. ముసాయిదాలో రాష్ట్రాన్ని మూడు ప్యాకేజిలుగా విభజించి మూడు సంస్థలకు అప్పగిస్తామనగా, ఇప్పుడు రాష్ట్రం మొత్తానికి జె.పి గ్రూపునకు చెందిన జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ ఒక్క దానికే కాంట్రాక్టు దక్కింది. దోపిడీ ఒకరి చేతిలో కేంద్రీకృతమైంది. ఎంపికైన కంపెనీకి అనుభవం, సామర్ధ్యం లేవని, నష్టాల్లో ఉందని వస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం ఇస్తున్న ఒకే ఒక్క సమాధానం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎంఎస్‌డిసి టెండర్లు ప్రాసెస్ చేసిందని. ఈ వాదన అంతగా నప్పదు. ఎందుకంటే విధి విధానాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. వాటిని కేంద్ర సంస్థ అమలు చేస్తుంది. మార్గదర్శకాల్లోనే మతలబంతా ఉంటుంది.
కాంట్రాక్టు సంస్థకు ఏమీ మిగలదనే ప్రభుత్వ వాదన నిలిచేది కాదు. రెండు కోట్ల టన్నుల ఇసుక తవ్వుతారని, టన్ను రూ.475 అనగా, ఇసుక అమ్మకం వలన రూ.950 కోట్లు వస్తే, సర్కారుకు 750 కోట్లు, నిర్వహణ ఖర్చులు రూ.65 కోట్లు పోగా, సంస్థకు మిగిలేది రూ.145 కోట్లట. సర్కారే చెబుతోంది కంపెనీ నుంచి రూ.120 కోట్ల బ్యాంక్ గ్యారంటీ తీసుకుంటామని. కేవలం రూ.25 కోట్ల కోసం ఏ సంస్థ అయినా అంత ష్యూరిటీ ఇవ్వడానికి ముందుకు వస్తుందా? నిరుడు 1.83 కోట్ల టన్నుల ఇసుక అందుబాటులో ఉంచామని, ఈ ఏట రెండు కోట్ల టన్నులకు పెంచుతున్నాం కనుక ప్రజలు తమకు కావాల్సినంత కొనుక్కోవచ్చంటున్నారు. నిరుడంతా లాక్‌డౌన్. అంతకుముందు నుంచే ఆర్థిక మాంద్యం ఉంది. అప్పటి లభ్యతతో ముడిపెట్టి నిరుటి మీద కేవలం 17 లక్షల టన్నులను పెంచేసి ఇక మీ ఇష్టం వచ్చినంత అనడం మోసం. రవాణ కలిపి ఇసుక గరిష్ట ధర నియోజక వర్గాల వారీ తర్వాత నిర్ణయిస్తారట. కొత్త విధానం అంటే గతం కంటే మెరుగ్గా ఉండాలి కొత్త సమస్యలు తెచ్చిపెట్టకూడదు. సాధ్యమైనంత వరకు ప్రభుత్వ ఏజెన్సీలే ఇసుక తవ్వకాలు జరపాలి. లేదంటే కనీసం ట్రాక్టర్ రూ.వెయ్యిపై ప్రజలకు అందించాలి. నదీ పరీవాహ గ్రామాల వారికి, పేదలు, బలహీన వర్గాలకు ఉచితంగా ఇవ్వాలి. కావాల్సినంత ఇసుకను అందుబాటులో ఉంచి నిర్మాణ రంగ కార్మికుల ఉపాధికి సర్కారు పూచీ పడాలి. లాక్‌డౌన్ కాలంలో తీవ్ర ఇబ్బందులు పడిన నిర్మాణ కార్మికులు ఇప్పటికీ కష్టాల్లోనే ఉన్నారు. ప్రైవేటు అంటే లాభాల రంధిలో నదీగర్భాలను ఇష్టానుసారం తొలుస్తాయి. పర్యావరణానికి హానికరం. తవ్వకాలపై ప్రభుత్వ నియంత్రణ అత్యవసరం.










