ప్రజాశక్తి-గుంటూరు: ఉపాధ్యాయులను జీతాల సమస్య వెంటాడుతూనే ఉంది. మూడు నెలలుగా బదిలీలు, ప్రమోషన్లు పొందిన ఉపాధ్యాయులకు జీతాలు అందలేదు. ఈ నెల మిగిలిన ఉపాధ్యాయులకూ జీతాలు జమ కాలేదు. సప్లిమెంటరీ బిల్లులు సబ్మిట్ చేయటానికి ఆదివారంతో గడువు ముగిసింది. ఇంకా కేడర్ స్ట్రెంగ్ అప్‌డేషన్ ప్రక్రియ, అందరికీ బిల్లులు వేయటం పూర్తి కాలేదు. దీంతో ఆగస్టు నెల జీతాలు సెప్టెంబర్‌లోనే జమవుతాయనే నమ్మకం లేదు. ఉపాధ్యాయుల కేడర్ స్ట్రెంగ్త్ అప్‌డేట్ కాకపోవటంతో టీచర్ల వివరాలు డిడిఒల లాగిన్‌లో చూపించట్లేదు. దీంతో వారికి జీతాల బిల్లులు వేయటం సాధ్యం కావట్లేదు. కొన్ని మండలాల్లో అయితే కొత్తగా విధుల్లో చేరిన ఎంఇఒలు (డిడిఒ) పేర్లే సిఎఫ్‌ఎంఎస్‌కు అనుసంధానం కాకపోవటంతో వారి పరిధిలోని ఉపాధ్యాయులకు జీతాలు ప్రశ్నార్థకంగా మారాయి.
గుంటూరు, ప్రత్తిపాడు, తుళ్లూరు మండలాల్లో కొత్తగా చేరిన ఎంఇఒల పేర్లు సిఎఫ్‌ఎంఎస్‌కు అనుసంధానం కాలేదు. వీరు ఎస్‌జిటిలకు వేతనాలు వేయాల్సి ఉంటుంది. గుంటూరు జిల్లాలో 5 వేల మంది వరకూ ఎస్‌జిటి ఉపాధ్యాయులు, 3 వేల మంది స్కూల్ అసిస్టెంట్లు ఉంటారు. 18 మండలాల పరిధిలో ఎస్‌జిటిలకూ ఎవ్వరికీ ఇంతవరకూ వేతనాలు అందలేదు. స్కూల్ అసిస్టెంట్లకు 30శాతమే జీతాలు అందినట్లు తెలిసింది. డిఇఒ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికీ ఈనెల జీతాలు అందలేదు. వారి పేర్లు కూడా అప్‌డేట్ చేస్తుండంతో ఈ ప్రక్రియలో కొందరు ఉద్యోగుల ఐడిలు కనిపించట్లేదు.
వేతనాలు ఒక సమస్యైతే, కేడర్ స్ట్రెంగ్ అప్‌డేషన్ ప్రక్రియలో ఉపాధ్యాయులందరి వివరాలు కనిపించకపోవటం, ఒకచోట పనిచేస్తుంటే మరొక మండలంలో చూపించటం, ఐడిలు కనిపించకపోవటం వంటి కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రత్తిపాడు మండలం, తుమ్మలపాలెంలోని ఒక పాఠశాలలో నలుగురు ఉపాధ్యాయులు ఉండగా, 40 మంది పని చేస్తున్నట్లు వెబ్‌సైట్‌లో చూపిస్తోంది. మండంలోని ఇతర పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పేర్లన్నీ తుమ్మలపాలెం స్కూల్లో చూపిస్తోంది. దీనిపై డిఇఒ కార్యాలయం నుండి విద్యాశాఖ ఉన్నతాధికారులకు నివేదిక పంపించారని తెలిసింది. కాకుమాను, తుళ్లూరు, పొన్నూరు ఇలా ప్రతి మండలంలో ఈ విధమైన సమస్య వెలుగు చూసింది. వాటిని సరి చేయాల్సి ఉంది. దీంతో డిడిఒలు (ఎంఇఒలు) వెబ్‌సైట్‌లో ఉన్న సక్రమంగా ఉన్న వారికే జీతాలు బిల్లులు వేశారు. కాగా 5వ తేదీ తర్వాత ఎరియర్స్ బిల్లులు సబ్మిట్ చేసిన ఉపాధ్యాయులకు జీతాలు జమ కాలేదు.
ఇదిలా ఉంటే గత మూడు నెలలుగా జీతాలు జమ కాకపోవటంతో ఉపాధ్యాయులు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, ఇప్పుడు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. గృహ సంబంధిత, పెళ్లి, వాహనం ఇతర అవసరాల కోసం బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్న వారు, బ్యాంకు ఖాతాల్లో ఇఎంఐల కోసం తగిన నిల్వలు లేక డిఫాల్టర్లుగా మారుతున్నారు. అంతే కాకుండా ప్రతినెలా ఉపాధ్యాయుల జీతాల నుండి ఎపిజిఎల్‌ఐ, పిఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్, ఇహెచ్‌ఎస్ వంటి ప్రభుత్వ డిడక్షన్‌లు కూడా నిలిచిపోయాయి. ఎపిజిఎల్‌ఐకి ఉపాధ్యాయుల వాటా మూడు నెలలుగా జమ కాకపోవటంతో అనుకోని ప్రమాదం జరిగితే నిబంధనల ప్రకారం వారికి రావాల్సిన సౌకర్యాలేవీ దక్కే అవకాశం లేదని అంటున్నారు.
కేడర్ స్ట్రెంగ్త్ అప్‌డేషన్‌కు సంబంధించి వివరాలు జిల్లా విద్యాశాఖ అధికారులు సిఎఫ్‌ఎంఎస్‌కు పంపించారు. అవి అప్‌డేట్ కావటానికి మూడు నాలుగు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలిసింది. మరోవైపు ఎరియర్స్ బిల్లులు వేసే గడువు ముగియటంతో వారందిరికీ ఈనెల్లోనే బిఉల్లలు వేస్తారా? వచ్చేనెల జీతాలతోపాటు వేస్తారా? అన్నది ప్రశ్నార్థకం. ప్రభుత్వం ఉపాధ్యాయుల జీతాల సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టి యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని, పెండింగ్ వేతనాలు అన్నీ ఈనెల్లోనే జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.










