
మూడు నెలలుగా అందని వేతనాలు
జిఒ 117 ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకూ తప్పని తిప్పలు
హై స్కూల్ ప్లస్‌లో చేరిన పిజిటిలదీ అదే పరిస్థితి
ఉమ్మడి జిల్లాలో రెండు వేల మందికి అందని జీతాలు
గందరగోళంగా అధికారుల సమాధానం
చెల్లించకపోతే మరో ఆందోళనకు సిద్ధం : యుటిఎఫ్
ప్రజాశక్తి - భీమవరం
ఉమ్మడి జిల్లాలో వేతనాల కోసం గురువులు గగ్గోలు పెడుతున్నారు. రెండు మూడు నెలల నుంచి జీతాలందక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. జిఒ 117 ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. హైస్కూల్ ప్లస్‌లో చేరిన పిఇటిలది కూడా ఇదే పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో సుమారు రెండు వేల మంది ఉపాధ్యాయులు జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే దీనిపై ఇటు ప్రభుత్వంగానీ అటు అధికారులు గానీ పట్టించుకోకపోవడమే కాకుండా పొంతనలేని సమాధానం చెబుతుంది. అయితే వివిధ కేటగిరిలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు తక్షణం జీతాలు అందించాలని లేనిపక్షలో మరో ఉద్యమానికి సిద్ధమవుతామని యుటిఎఫ్ హెచ్చరిస్తుంది. వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఉపాధ్యాయులపై కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడమే కాకుండా, అడుగుతున్న ఉపాధ్యాయులపై దౌర్జన్యానికి దిగి తీవ్ర నిర్బంధాలను విధిస్తూ అక్రమ అరెస్టులకు పాల్పడుతుంది.
ఇదిలా ఉంటే నూతన విద్యావిధానం పేరుతో ప్రభుత్వవిద్యను నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తూ ఉపాధ్యాయుల హక్కులను కాలరాసే విధంగా పాలన కొనసాగిస్తుంది. ఉమ్మడి జిల్లాలో 98 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 117 జిఒ ద్వారా మంజూరైన పోస్టులు ఉపాధ్యాయులు వివిధ కేటగిరీల్లో విధులు నిర్వహిస్తున్నారు. మే నెలలో జరిగిన ఈ ప్రక్రియ ద్వారా కొత్తగా సృష్టించిన స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో బదిలీపై చేరిన టీచర్లకు, జిల్లాలో ఎంపికచేసిన మండలాల్లో ఇంటర్ విద్యతో గతేడాది ఏర్పాటు చేసిన హైస్కూల్ ప్లస్ (జెడ్‌పి జూనియర్ కళాశాల)లలో నియమించిన పిఇటిలకు, ఎంఇఒల కొత్తగా ఏర్పాటు చేసిన పోస్టుల్లో, హెచ్‌ఎంలు లేనిచోట ఇలా వివిధ రకాల బదిలీల్లో వెళ్లి విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు జీతాలు అందని పరిస్థితి ఏర్పడింది. రెండు మూడు నెలల నుంచి జీతాలు కోసం ఎదురుచూస్తున్నారు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాల బిల్లులను ఆమోదించడానికి జిల్లాస్థాయిలో ఇంతవరకూ ఖజనాశాఖకు రాష్ట్ర ఖజానా కార్యాలయం నుంచి సరైన వివరాలు అందకపోవడమే దీనికి కారణమని జిల్లా విద్యాశాఖ మీద ఆరోపణలున్నాయి. ప్రభుత్వం కూడా కనీసం దృష్టి సారించట్లేదని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అలాగే ఈ ఏడాది జూన్‌లో కొత్తగా ఆయా ప్రాథమికోన్నత, ఉన్నతపాఠశాలలకు వివిధ సబ్జెక్టుల్లో క్రియేట్ చేసిన స్కూల్ అసిస్టెంట్ కేడర్ ఉపాధ్యాయులకు కూడా జీతాలు అందని పరిస్థితి తలెత్తింది. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీప ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో పెద్దసంఖ్యలోనే ఎస్‌జిటిలు మిగులు (సర్ ప్లస్) ఉపాధ్యాయులుగా ఉన్నారు.
మరోవైపు ప్రాథమికోన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లను నియమించాల్సి ఉండటంతో అర్హులైన ఎస్‌జిటిలకు స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి పొంది కౌన్సెలింగ్ ద్వారా ఆయా యుపి స్కూళ్లల్లో గత నెలలో బదిలీపై నియమించారు. ఇప్పటికే స్కూల్ అసిస్టెంట్ పోస్టులున్న పాఠశాలలకు బదిలీ అయిన టీచర్లకు జీతభత్యాల చెల్లింపులో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదు కానీ కొత్తగా క్రియేట్ చేసిన స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో బదిలీపై చేరిన ఉపాధ్యాయులకే జీతాల చెల్లింపులో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో సాధారణ బదిలీల్లో ఉమ్మడి జిల్లాలో బదిలీ అయిన ఉపాధ్యాయుల్లో దాదాపు రెండు వేల మందికి గత రెండు మూడు నెలల నుంచి జీతాలు అందని పరిస్థితి ఉంది.
సవాలక్ష సమస్యలు పొంతనలేని సమాధానాలు
కొత్తగా భర్తీ చేసిన పోస్టులను కేడర్ స్ట్రెంగ్త్‌లో చేర్చకపోవడం, చేర్చినా వాటిని రాష్ట్ర కార్యాలయంలో ఇంతవరకూ ఆమోదించకపోవడం వల్ల సంబంధిత టీచర్ల వివరాలు ఖజనాశాఖకు అందలేదని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. ప్రస్తుతం జిల్లాల నుంచి రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ (సిఎస్‌ఇ) కార్యాలయానికి చేరిన టీచర్ కేడర్‌ంగ్ వివరాల తుదిపరిశీలన జరుగుతోంది. ఆ తర్వాత వివరాలను సిఎస్‌ఇ ఆమోదించి రాష్ట్ర ట్రెజరీ కార్యాలయానికి పంపుతారు. ఆ తర్వాతే జిల్లా ఖజానా కార్యాలయానికి పంపిస్తారు. అప్పుడు మాత్రమే సంబంధిత టీచర్ల జీతాల బిల్లులను జిల్లాస్థాయిలో స్వీకరించి పరిశీలన అనంతరం ఆమోదిస్తే తప్ప జీతాలు అందే పరిస్థితి కనిపించట్లేదు. అయితే విద్యాశాఖ అధికారులు మాత్రం పొంతనలేని సమాధానం చెబుతున్నారు. జీతభత్యాలకు సంబంధించి అన్ని పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం కూడా పట్టనట్లు వ్యవహరించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జీతాల్లేక ఇబ్బంది పడుతున్నాం
బి.శ్రీనివాసరావు, పిజిటి ఉపాధ్యాయులు, పాలకోడేరు
నూతనంగా ప్రారంభించిన హైస్కూల్ ప్లస్‌లో ఈ ఏడాది మే 22న పిజిటి ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరాను. గ్రామాల్లో ప్రతీ ఇంటికి తిరిగి విద్యార్థినులను సమీకరించి ప్రత్యేక శ్రద్ధతో విద్యాబోధన చేస్తున్నాము. మూడు నెలల నుంచి జీతాలు అందడం లేదు. ఆర్థికంగా నానా అవస్థలు పడుతున్నాను. వివిధ గృహరుణాలు ఇతరత్రా రుణాములు చెల్లింపులకు తీవ్ర అంతరాయం కలిగి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాను. ప్రభుత్వం స్పందించి మా జీతాలు మాకు ఇప్పించండి.
ఆందోళన చేపడతాం
బి.గోపిమూర్తి, యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి
117 జిఒ తీసుకొచ్చి జిల్లాలో వివిధ రకాలుగా బదిలీలు చేపట్టారు. ఈ ప్రక్రియ వల్ల అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయినా ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మూడు నెలల నుంచి ప్రభుత్వం జీతాలివ్వడం లేదు. దీనివల్ల ఉపాధ్యాయులు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఇప్పటికే జీతాలు చెల్లించాలని రెండు విడతల్లో ఆందోళనలు చేపట్టాము. ఈ నెల 12న 12 గంటల పాటు నిరసన కూడా తెలుపుతున్నాం. ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించకపోతే ఆందోళన ఉధృతం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
ఉపాధ్యాయులు ఎదురుచూపులు
ఉమ్మడి జిల్లాలో జీతభత్యాల కోసం సుమారు రెండు వేలమంది ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. రెండు నెలల నుంచి జీతాలు అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. రుణాలకు ఇఎంఐలు, కుటుంబ పోషణకు సమయానికి జీతాలందక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా భర్తీ చేసిన పోస్టులు, బదిలీల్లో జరిగిన అవకతవకలు, ఉపాధ్యాయులపై కక్షపూరిత చర్యల కారణంగా వివిధ కేడర్లలో బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.