తల్లి తండ్రుల తరువాత గురువుకు స్థానం కల్పించిన సంస్కృతి మనది. చిన్నారుల భవిష్యత్తును తీర్చి దిద్ది, భవిష్యత్తుకు బాటలు వేసే ఉపాధ్యాయలంటే సమాజానికి ఎనలేని గౌరవం! అటువంటిది, కరోనా కష్ట కాలంలో రాష్ట్రంలో వారి దుస్థితి వింటే గుండె తరుక్కుపోతోంది. వైరస్ విజృంభణ ప్రభావం ఉపాధ్యాయులపై తీవ్రంగా పడింది. ఎంతమందికి వైరస్ సోకిందో నిర్ధారించి చెప్పడానికి అధికారికంగా లెక్కలు లేవు. అయితే, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) సేకరించిన సమాచారం 391 మంది గడిచిన రెండు నెలల కాలంలో వైరస్ సోకి మరణించారు. అంటే, రోజుకు ఆరుగురి కన్నా ఎక్కువ మంది ప్రాణాలు విడిచారు. ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయంటే వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు! రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన, చేస్తున్న విధానాలే ఈ దుస్థితికి కారణం. ఉపాధ్యాయులతోకానీ, ఉపాధ్యాయ సంఘాలతోకానీ, చట్ట సభల్లో వారి ప్రతినిధులైన ఎంఎల్‌సిలతో కానీ ఏ మాత్రం చర్చించకుండా బడులను తెరిచిన రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థాయిలో రక్షణ చర్యలు కల్పించడంలో విఫలమైంది. మాస్క్‌లు, శానిటైజర్లు, భౌతికదూరం అంటూ అట్టహాసంగా చేసిన ప్రకటనలు ఏ దశలోనూ అమలుకు నోచుకోలేదు. పులి మీద పుట్ర అన్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఉప ఎన్నిక కూడా ఉపాధ్యాయుల్లో వైరస్ వ్యాప్తికి కారణమయ్యాయి. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి అవసరమైన భద్రత కల్పించారా అంటే లేదన్నదే సమాధానం! ఈ నిర్లక్ష్యం కూడా ఉపాధ్యాయులను కాటేసింది. తిరుపతి ఉప ఎన్నిక జరిగిన చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అత్యధికంగా ఉపాధ్యాయులు మృత్యువాత పడటం (మరణించిన వారిలో 60 శాతం) దీనికి నిదర్శనం.
ఇంత జరుగుతున్నా, ఇందరు ఉపాధ్యాయులు అసువులు బాస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి ఒక్క సంతాప ప్రకటన కానీ, ఒక్క ఓదార్పు మాట కానీ లేకపోవడం అత్యంత బాధాకరం! విద్యాశాఖ ఉన్నతాధికారులైతే మరింత ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. కరోనాతో ఒక్క ఉపాధ్యాయుడు కూడా మరణించినట్టు తమ దృష్టికి రాలేదని ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించడం బాధ్యతా రాహిత్యానికి పరాకాష్ట. ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా అన్నట్టు జిల్లా స్థాయి అధికారులు సైతం ఇదే విధంగా వ్యవహరిస్తుండం, సానుభూతిగా ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం ఉపాధ్యాయలోకాన్ని తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. అసలు ఎందరు ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు? వారిలో ఎందరు మరణించారన్న లెక్కలు చెప్పాల్సిన విద్యాశాఖ ఇంత నిష్క్రియగా మారిపోవడం దేనికి సంకేతం? ఉద్దేశ్యపూర్వకంగానే దాస్తున్నారా? వైరస్ ఉధృతి తగ్గకముందే బడులు తెరిచిందెవ్వరు ? రాష్ట్ర ప్రభుత్వమే కదా...పోనీ అక్కడతో ఊరుకున్నారా.. నాడు..నేడు పనులు, ఆన్‌లైన్‌లో బోధన, యాప్‌ల నిర్వహణ, ఎన్నికల విధులు ఇలా చెప్పుకుంటూ పోతే కరోనా కాలంలో ఉపాధ్యాయులకు అప్పచెప్పిన బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. ఇళ్ల నుండి బయటకు వచ్చి ఇన్ని పనులు చేస్తున్న వీరిని ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తించారా? కనీసం వ్యాక్సినేషన్ కార్యక్రమంలోనైనా ప్రాధాన్యత ఇచ్చారా? లేదు, ప్రాణాలు పోయించినంత వరకు పని చేయించి, మరణాన్ని కూడా గుర్తించకపోవడం ఎక్కడి మానవత్వం? ఒకవైపు దిగజారుతున్న పరిస్థితులు కలవరపెడుతుంటే గత విద్యాసంవత్సరం చివరలో నిర్వహించిన పరీక్షల మార్కులు అప్‌లోడ్ చేసి తీరాలని బుధవారం సాయంత్రం ఆదేశించడం దుర్మార్గం కాదా? ఇంత అమానవీయత అవసరమా! ఒకవైపు లాక్‌డౌన్ ఉంది. ప్రజా రవాణా లేదు. ఉపాధ్యాయులు బడులకు ఎలా వెళ్లగలరు? ఉన్నతాధికారులు ఈ మాత్రం ఆలోచించరా? ఇప్పటికైనా విద్యారంగంలో నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వం స్పందించాలి. తాజాగా అలహాబాద్ హైకోర్టు కరోనా బాధిత ఉపాధ్యాయులకు పరిహారం చెల్లింపు విషయంలో ఇచ్చిన తీర్పును మన రాష్ట్రంలోనూ అమలు చేయాలి. ఉపాధ్యాయ లోకానికి అండగా నిలవడంతో పాటు వారిలో ధైర్యాన్ని, స్ఫూర్తిని కలిగించాలి. దానికి భిన్నంగా వారి నైతిక ధృతిని దెబ్బ తీస్తే దాని ప్రభావం భావితరాలపై ఉంటుంది.










