ప్రజాశక్తి-పాడేరు:ఏజెన్సీలోని గిరిజన గురుకులాల్లో అడ్మిషన్ల కంటే ముందు వసతి సౌకర్యాలను మెరుగు పరచాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కే.ప్రభుదాస్ అధికారులను కోరారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లా డుతూ, ఈ నెల 9,10తేదీల్లో గురుకులాల్లో సీట్లకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు కౌన్సిలింగ్ ఉంటుందని పిఒ ప్రకటించారని, అడ్మిషన్ల కంటే ముందు వసతి సౌకర్యాలు కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. విద్యార్థి సంఘంగా ప్రాజెక్ట్ అధికారికి విన్నవించు కుంటున్నామని చెప్పారు. పాఠశాలలు తెరవక, అడ్మిషన్లు పూర్తికాకముందే గురుకులాల్లో పివో పర్యవేక్షణ చేయాలని కోరారు. ఏజెన్సీ 11 మండలాల్లో 8 గురుకుల కళాశాలలు ఉన్నాయని, ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో కనీస వసతులు లేవని వాపోయారు. అదే విధంగా గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి నచ్చిన గ్రూపులో సీట్లు కేటాయించాలని, వీలైనంత ఎక్కువగా సీట్లు కల్పించి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికీ ప్రవేశాలు కల్పించాలన్నారు. ఇందుకు అనుగుణంగా వసతి సౌకర్యాలను విస్తరించాలన్నారు. కొన్ని చోట్ల ఉపాధ్యాయుల కొరత కూడా ఉందని, విద్యా బోధన కుంటుపడుతోందని దీనిపై అధికారులు దృష్టి సారించి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. విద్యార్థుల ఉత్తీర్ణత పెంచే విధంగా మెరుగైన విద్యా బోధన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గత ఏడాది ఆన్లైన్‌లో కౌన్సిలింగ్ నిర్వహించడంతో చాలా మంది విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారని, ఒక గ్రూపులో సీటు కోసం దరఖాస్తు చేసుకుంటే వేరే గ్రూపులో సీటు వచ్చిన పరిస్థితి చూశామన్నారు.. అంతేకాకుండా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు సీట్లు రాక ఐటీడీఏ, కళాశాలల చుట్టూ ప్రదక్షిణలు తిరిగిన పరిస్థితులు చూశామన్నారు. ఈ ఏడాది ఇలా చేస్తే విద్యార్థులంతా ఏకమై కచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ నాయకులు మత్యరాజు, లోకష్, నరేష్, మాణిక్యం మణి పాల్గొన్నారు.










