Jun 29,2023 00:17

అడ్మిషన్ల కోసం డిసిఒ కార్యాలయానికి వచ్చిన తల్లిదండ్రులు

ప్రజాశక్తి-గుంటూరు : సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాసంస్థల్లో ఈ ఏడాది సీట్లు నిండాయి. మొదటి జాబితాలోనే దాదాపు సీట్లన్నీ అయిపోయాయి. బాలికల విద్యాలయాల్లో పూర్తిగా భర్తీ కాగా, బాలుర విద్యాలయాల్లో అక్కడక్కడా కొన్ని సీట్లు మాత్రమే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. చదువు, వసతి సౌకర్యం ఒకేచోట ఉండటం, బాలికలు, బాలురకు వేర్వేరుగా స్కూల్స్‌ ఏర్పాటు చేయటంతోపాటు, ఉత్తీర్ణతలోనూ మెరుగైన ఫలితాలు సాధించటంతో గురుకులాల్లో అడ్మిషన్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఖాళీలు లేకపోవటంతో విద్యార్థుల తల్లిందండ్రులు రికమండేషన్‌ లేఖలతో జిల్లా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌ సోషల్‌ వెల్ఫేర్‌ గురుకులాలు 21 ఉన్నాయి. వాటిల్లో తాడికొండ, అడవితక్కెళ్లపాడు, చుండూరు, నిజాంపట్నం, కారంపూడి, అచ్చంపేట, గురుజాల, యడ్లపాడు, సత్తెనపల్లిలో బాలుర గురుకులాలు ఉన్నాయి. కాకుమాను, బాపట్ల, రేపల్లె, నరసాయపాలెం, నార్త్‌ అద్దంకి, నాగులపాలెం, యద్దనపూడి, రామకృష్ణాపురం, విపి సౌత్‌, ఉప్పలపాడు, అమరావతి, వినుకొండలో బాలికల విద్యాలయాలు ఉన్నాయి. వీటిల్లో ఒక్కొక్క స్కూల్లో 480 నుంచి 640 వరకూ సీట్లున్నాయి. ఈ ఏడాది అన్ని ఖాళీలు భర్తీ అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంటర్‌లో కూడా అడ్మిషన్లు బాగానే అయినట్లు చెబుతున్నారు.
రామకృష్ణాపురం, అమరావతి, బాపట్ల వంటి కొన్ని విద్యా సంస్థలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. గురుకులాల్లో ఖాళీలు లేకపోవటంతో తమ పిల్లలకూ సీట్లు ఇవ్వాలని కోరుతూ తల్లిదండ్రులు గుంటూరులోని గురుకులాల జిల్లా సమన్వయకర్త కార్యాలయానికి ప్రతి రోజూ పెద్ద సంఖ్యలో వస్తున్నారు. రోజూ వందల మంది అర్జీలు అందచేస్తున్నారు. కొందరైతే ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, మంత్రుల సిఫార్సుల లేఖలు సైతం తీసుకురావటం గమనార్హం. దీంతో కొన్ని విద్యా సంస్థల్లో మిగిలిపోయిన కొద్దిపాటి సీట్ల కేటాయింపునకు పాఠశాల స్థాయిలో అడ్మిషన్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. సిఫార్సు లేఖలతో వచ్చిన వారికి సీట్లు కేటాయించలేక సతమతం అవుతున్నారు. ఖాళీలుంటే పిలుస్తామని అధికారులు చెప్పి పంపిస్తున్నారు.
మెరిట్‌ ప్రాతిపదికన సీట్లు ఇచ్చాము
కె.పద్మజ, జిల్లా కోఆర్డినేటర్‌

గురుకులాల్లో ఈ ఏడాది సీట్లు దాదాపుగా అయిపోయాయి. మెరిట్‌ ప్రాతిపదికనే సీట్లు కేటాయించాం. ఇంకా అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు వస్తున్నారు. అవకాశం ఉన్నంత వరకూ వారికి అడ్మిషన్లు ఇవ్వటానికి ప్రయత్నిస్తున్నాం. ఎక్కడెక్కడ సీట్లు మిగిలాయో చూసి, అక్కడ కేటాయించటానికి చర్యలు తీసుకుంటున్నాము.