ప్రజాశక్తి - చింతలపూడి
ప్రభుత్వాలు మారినా డాక్టర్ బిఆర్.అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాల అభివృద్ధి జరగడంలేదని సిపిఎం ఏరియా కన్వీనర్ రామిశెట్టి సత్యనారాయణ అన్నారు. పట్టణంలో గురుకుల పాఠశాలను ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్.అంబేద్కర్ గురుకులంలో 650 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. వీరందరు రేకుల షెడ్టులో ఉంటున్నారని, పాఠశాల తరగతి గదులు, వసతులు లేవని చెప్పారు. విద్యార్థుల సంఖ్యకు సరిపడా మరుగుదొడ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఎండాకాలంలో అమితమైన వేడితో విద్యార్థులు ఉక్కిరిబిక్కిరవుతున్నారన్నారు. ప్రభుత్వాలకు, ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేదన్నారు. కోట్లాది రూపాయలతో నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయన్నారు. నిర్మాణంలో ఆగిపోయిన గురుకుల పాఠశాల భవనాలను పూర్తిచేయాలని కోరారు. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించకపోతే ప్రజాసంఘాలను కలుపుకొని ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. పాఠాశాలలో చదివే ఎస్‌సి పేద విద్యార్థులేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవగురు, సత్తిబాబు పాల్గొన్నారు.










