
రాయచోటి టౌన్ : ప్రభుత్వం నాలుగు నెలల నుంచి ఎపి బాలయోగి గురుకుల పాఠశాలలకు సంబంధించిన ఆహార బిల్లులను ఇంతవరకు చెల్లించకపోవడం చాలా దుర్మార్గమని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. శుక్రవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో వారు మాట్లాడుతూ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో బాలయోగి గురుకుల పాఠశాలలకు సంబంధించిన క్యాంటీన్ కాంట్రాక్టర్ల పరిస్థితి చాలా దయనీయంగా తయారైంద న్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రతినెల రెండుసార్లు అనవసరమైన స్కీములను ప్రవేశపెట్టి బట్టన్ నొక్కడం ఆనవాయితీగా మారిందని మండి పడ్డారు. ప్రభుత్వం సకాలంలో ఆహార బిల్లులను విడుదల చేస్తే సదరు కాంట్రా క్టర్లు విద్యార్థులకు మంచి ఆహారం అందించగలరని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలకు కొన్ని వేల కోట్ల రూపాయల బిల్లులు నాలుగు నెలలుగా విడుదల చేయకుండా పెండింగ్‌లో పెట్టడం ఎంతవరకు సమంజ సమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాలయోగి గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు, స్వీపర్లకు, వంట మనుషులకు సకాలంలో జీతాలు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే బాలయోగి గురుకుల పాఠశాలలకు సంబంధించిన అన్ని బిల్లులు తక్షణం విడుదల చేసి కాంట్రాక్టర్లకు, విద్యార్థులకు కాపాడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ ఎస్.ఎం.డి.గౌస్, కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ గోల్డ్ అల్లా బకష్, డిసిసి మైనార్టీ అధ్యక్షుడు ఆడిటర్ మన్సూర్ అలీఖాన్, మాజీ పట్టణ అధ్యక్షులు శర్వాని ఫారుక్ ఖాన్, దర్బార్ బాషా, మైనార్టీ సెక్రటరీ యహియా బాషా, షరీఫ్ పాల్గొన్నారు.