Nov 21,2023 21:00

ప్రజాశక్తి - ఏలూరు స్పోర్ట్స్‌
           పెదవేగి గురుకుల పాఠశాల విద్యార్థి అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, తోటి విద్యార్థులు, బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భీమడోలు మండలం అర్జావారిగూడేనికి చెందిన డి.కమలేష్‌(14), గురుకుల విద్యాలయంలో పదో తరగతి చదువుతున్నాడు. అతని తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు(తంబి), రూతు మనస్పర్థల కారణంగా ఏడేళ్ల క్రితం పెద్దల సమక్షంలో విడిపోయారు. రూతు చిన్న కుమారుణ్ని తీసుకుని చింతలపూడి వెళ్లిపోయింది. కమలేష్‌ తండ్రి వద్ద ఉంటూ గురుకుల విద్యాలయంలో చదువుతున్నాడు. ఈ తరుణంలో సోమవారం అర్ధరాత్రి వసతి గృహం పక్కనే ఆవరణలో ఉన్న చెట్టుకు ఉరివేసుకుని కమలేష్‌ మృతిచెందాడు. గమనించిన తోటి విద్యార్థుల వార్డెన్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. పెదవేగి తహశీల్దారు నాగరాజు సమక్షంలో ఎస్‌ఐ ఎం.లక్ష్మణ్‌ పంచనామా నిర్వహించారు. అనంతరం కమలేశ్‌ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కమలేష్‌ మృతికి సంబందించి భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. జూలై నెలలో సెలవులకు ఇంటికెళ్లి తిరిగి వచ్చేటప్పుడు మద్యం సీసా తీసుకొచ్చాడని తెలిసిన ప్రిన్సిపల్‌, తండ్రిని పిలిపించి కమలేష్‌ను మందలించారు. ఈ ఘటనపై గతకొంతకాలంగా మనస్తాపానికి గురైఉంటాడని చెబుతున్నారు. అలాగే తల్లిదండ్రులు విడిపోవడం వల్ల కూడా అతను మనస్తాపానికి గురై ఉండి ఉండొచ్చని మరో కారణంగా చెబుతున్నారు. ఏలూరు ఆర్‌డిఒ ఖాజావలి, డిఇఒ శ్యామ్‌సుందర్‌, గురుకుల విద్యాలయాల కన్వీనర్‌ నోముల సంజీవరావు కమలేష్‌ మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విచారణలో పదో తరగతి పరీక్షలు దగ్గర వేడుతున్న తరుణంలో పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేననే మానసిక ఆందోళనతో సతమతమవుతున్నట్లు తోటివిద్యార్థులు చెప్పారని ఆర్‌డిఒ తెలిపారు. విద్యార్థి మృతిపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.