Sep 30,2023 19:14

నినాదాలు చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి-నెల్లూరు :మైనార్టీ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు కాలుష్యంతో విలవిలలాడుతున్నారని, అక్కచెరువుపాడు ప్రాంతంలో రూ.15 కోట్ల నిధులతో నూతన భవన నిర్మాణ పనులు మూడు నెలల్లో పూర్తి చేసి ప్రభుత్వం విద్యార్ధుల ఆరోగ్యాన్ని పరిరక్షించాలని ఆవాజ్‌ జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది.శనివారం ఆవాజ్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆటోనగర్‌ లోని ప్రస్తుత మైనారిటీ గురుకుల పాఠశాల నుంచి అక్కచెరువుపాడు వరకు స్కూటర్‌ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవాజ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సయ్యద్‌ రఫీ, షేక్‌ రషీద్‌లు మాట్లాడుతూ అక్కచెరువుపాడులో నిర్మిస్తున్న మైనారిటీ గురుకుల పాఠశాల నిర్మాణ పనులు మూడు నెలల్లోగా పూర్తి చేయని యెడల జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రజాసంఘాలు ఇతర మైనారిటీ సంఘాలతో కలుపుకొని జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడుతామన్నారు. స్కూటర్‌ ర్యాలీ అనంతరం అక్కచెరువుపాడు లోని నిర్మాణంలో ఉన్న గురుకుల పాఠశాల భవనాన్ని ఆవాజ్‌ కమిటీ పరిశీలించింది. ఈ సందర్భంగా ఆవాజ్‌ జిల్లా కార్యదర్శి షేక్‌ రషీద్‌ మాట్లాడుతూ 15 కోట్ల విలువ మైనారిటీ గురుకుల పాఠశాల పనులను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని 70 శాతం పని పూర్తి అయిన గురుకుల పాఠశాలలను పూర్తి చేయకపోవడం శోచనీయమన్నారు. ఈ గురుకుల పాఠశాల పూర్తయితే మైనారిటీ విద్యార్థులు ఎక్కువమంది చేరే అవకాశం ఉంటుందని అందువలన ప్రభుత్వం వెంటనే పూర్తి చేయా లన్నారు. ప్రస్తుత గురుకుల పాఠశాల వద్ద పిల్లలు కాలుష్యంతో అల్లాడుతున్నారని అందువలన వెంటనే కొత్త గురుకుల పాఠశాల పనులు మొదలుపెట్టి మూడు నెలల్లోగా పూర్తి చేయాలన్నారు. ఈ ప్రభుత్వం మైనారిటీలకు అరచేతిలో స్వర్గం చూపిస్తుందని జిల్లాలో ఇంత పెద్ద మైనారిటీ గురుకుల పాఠశాలను పూర్తి చేయకపోవడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం చాలా దారుణమన్నారు.మైనారిటీ జిల్లా నాయకులు జియావుల్‌ హక్‌ మాట్లాడుతూ మైనారిటీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటుందని మైనార్టీలకు ఉండే సమస్యలను పట్టించుకోవడంలో ప్రభుత్వం దూరంగా ఉంటుందన్నారు. ఆవాజ్‌ ఇతర మైనారిటీ సంఘాలతో కలిపుకుని గురుకుల పాఠశాలను పనులు త్వరగా పూర్తి చేసేందుకు రాబోయే రోజుల్లో కార్యక్రమాలను రూపొందించుకుంటామన్నారు. డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు బిపి నరసింహ మాట్లాడుతూ మైనారిటీ విద్యార్థులకు ఈ గురుకుల పాఠశాల పూర్తయితే చాలా ఉపయోగాలు ఉన్నాయని అందువలన ప్రభుత్వం త్వరగా ఈ పని పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. అలా చేయకపోతే రాబోయే రోజుల్లో ఆవాజ్‌ తో కలిసి గురుకుల పాఠశాల పై తీసుకున్న కార్యక్రమాల్లో మేము కూడా ముందుంటామన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆవాజ్‌ రూరల్‌ అధ్యక్ష, కార్యదర్శులు షేక్‌ నజీర్‌ భాష, సయ్యద్‌ మీరా జిల్లా కమిటీ సభ్యులు షేక్‌ రియాజ్‌, సయ్యద్‌ రవూఫ్‌, షేక్‌ ఫయాజ్‌, ఎస్‌ కే చాంద్‌ బాషా, రూరల్‌ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.