ప్రజాశక్తి - కొత్తవలస : వికలాంగులకు, పేద ప్రజలకు గురుదేవ్ చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి అన్నారు. బుధవారం మంగళపాలెం వద్ద గల శ్రీ గురుదేవ్ చాటిబుల్ ట్రస్ట్ 25వ వార్షికోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ట్రస్టు ద్వారా ఇటువంటి సేవలు అందించడం అభినందనీయమన్నారు. మానవతా దృక్పథంతో వికలాంగులకు కనీస సౌకర్యాలు కల్పించడం గొప్ప విషయమన్నారు. రాష్ట్ర నలుమూలలు నుంచి గాక, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వికలాంగులకు అన్ని సౌకర్యాలూ కల్పించి, కృత్రిమ అవయవాలు అందించడం గొప్ప విషయమన్నారు. గురుదేవా ట్రస్టు ద్వారా కేవలం కృత్రిమ అవయవాలు పంపిణీ చేయడమే గాక, పేద రోగులకు కనీస వైద్య సదుపాయం అందించాలని ఆస్పత్రి నిర్మించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ట్రస్ట్‌కు సహాయ సహకారాలు అందిస్తున్న వారికి కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. వికలాంగుల అభ్యున్నతి కోసం జగదీశ్ ట్రస్ట్ ఏర్పాటు చేసి అందిస్తున్న సేవలు మహాత్తరమైనవని కొనియాడారు. 25 ఏళ్ల పాటూ సుమారు 2లక్షలకు పైగా కృత్రిమ ఉపకారణాలను వికలాంగులకు ఉచితంగా అందజేసి, వారి స్వయం ఉపాధికి సహకరిస్తున్న జగదీశ్ సేవలను కలెక్టర్ అభినందించారు. ముందుగా ట్రస్ట్ ప్రాంగణంలోని అవయవ తయారీ కేంద్రం, గురుదేవ ఆసుపత్రిని కలెక్టర్ సందర్శించారు. అనంతరం పలువురు వికలాంగులకు కలెక్టర్ చేతుల మీదుగా కృత్రిమ కాళ్ళు, చేతులు, చెవిటి మిషన్లు, బ్లైండ్ స్టిక్స్, వృద్ధులకు బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాస్ మిశ్రా, ఉప తహశీల్దార్ రమేష్, ఆర్.ఐ రాజేష్, ఇఒపిఆర్‌డి కర్రి ధర్మారావు, పి.ఎస్ విశ్వనాదు కృష్ణారావు, ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీశ్ కుమార్, గురుదేవ ఆస్పత్రి సిఇఒ అచ్యుతరామ్మయ్య, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.










