Nov 17,2023 21:40

మృతిచెందిన వ్యక్తి

ప్రజాశక్తి - లక్కవరపుకోట :  లక్కవరపుకోట సమీపంలో ఉన్న శాంభవి లేఔట్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం శుక్రవారం లభ్యమైంది. స్థానికుల కథనం ప్రకారం... గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణ నిమిత్తం విశాఖ జిల్లా లంకెలపాలెం సమీపంలోని ఎన్‌టిపిసి పరిశ్రమ నుంచి బూడిద లోడుతో తామరాపల్లి వెళ్లేందుకు రెండు లారీలు బయలుదేరాయి. ముందుగా లక్కవరపుకోటకు చేరుకున్న లారీ మండల కూడలిలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలుర వసతిగృహ సమీపంలో ఆగి ఉంది. ఆగి ఉన్న లారీని బుధవారం తెల్లవారుజామున అదేలోడుతో వస్తున్న మరో లారీ బలంగా ఢకొీన్న సంఘటన విదితమే. ఈ ఘటనలో ఢకొీట్టిన లారీ కేబిన్‌ నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన లారీ క్లీనరును శాంభవి లేఔట్‌లో పడేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో ప్రమాదానికి కారణమైన లారీ ఉంది. ముందుగా అక్కడ నిలిపేసి ఉంచిన లారీ మాత్రం రాత్రికిరాత్రే ఉడాయించడంతో స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విఆర్‌ఒ లింగం జ్ఞానేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఎం.ముకుందరావు కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహానికి శవపంచనామా నిర్వహించి, పోస్ట్‌మార్టం నిమిత్తం శృంగవరపుకోట సిహెచ్‌సికి తరలించారు.