Oct 09,2023 00:17

పాదయాత్రలో మాట్లాడుతున్న ఎం.రవి

ప్రజాశక్తి - దుగ్గిరాల : డెల్టా ప్రాంతంలో ఎక్కువగా వ్యవసాయం చేస్తోంది కౌల్దార్లే అయినా వారికి ప్రభుత్వం గుర్తింపు కార్డులను సరిగా మంజూరు చేయలేదని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు విమర్శించారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గంలో చేపట్టిన ప్రజా చైతన్య పాదయాత్ర ఆరో రోజుకు చేరుకుంది. ఆదివారం మండలంలోని పెదపాలెం నుండి ప్రారంభమైన యాత్ర పేరుకులపూడి, చుక్కపల్లివారిపాలెం, తాడిబోయినవారిపాలెం, నల్లమేకలవారిపాలెం, ఈమని, దుగ్గిరాల, మంచికలపూడి గ్రామాల్లో సాగింది. పాదయాత్ర బృందం ఆయా గ్రామాల్లోని ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకోవడంతోపాటు పొలాలు, జగనన్న కాలనీలు, డ్రెయినేజీ దుస్థితి, నిరుపయోగంగా ఉన్న వ్యర్థాల నిర్వహణ కేంద్రం తదితరాలను నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో 75 శాతం మంది కౌలురైతులే అయినా వారికి గుర్తింపు కార్డులు దక్కలేదన్నారు. కౌలుదారు చట్టాని మార్చిన వైసిపి ప్రభుత్వం భూ యజమాని సంతకాన్ని తప్పనిసరి చేయడంతో అందుకు యజమానులెవరూ మందుకు రావడం లేదని అన్నారు. వ్యవసాయంలో కీలకమైన కౌల్దార్లకు యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా గుర్తింపు కార్డులు, పంట రుణాలు ఇవ్వాలని కోరారు. చుక్కపల్లివారిపాలెంలో జగనన్న కాలనీలో కేటాయించిన ప్లాట్లలో సగం మంది కూడా ఇళ్లు నిర్మించుకోలేకపోయారని, ప్రభుత్వం ఇస్తున్న రూ.1.80 లక్షలు ఇంటి నిర్మాణానికి ఏ మాత్రమూ సరిపోదని, కనీసం రూ.5 లక్షలు కేటాయించాలని కోరారు. ఈమని గ్రామంలో గులాబీ తోటలను పరిశీలించి మాట్లాడుతూ రైతులకు పెట్టుబడి కూడా రావడం లేదని, వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. చెత్త నుండి సంపద తయారు చేస్తామంటూ ప్రతి గ్రామంలో రూ.ఏడెనిమిది లక్షలతో నిర్మాణాలు చేపట్టినా వాటిని నిరుపయోగంగా వదిలేశారని అన్నారు.
దుగ్గిరాల, ఈమని గ్రామాల్లో భవన నిర్మాణ కార్మికులు అధికంగా ఉన్నారని, అయితే సిమెంట్‌, ఇతర నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల కారణంగా ఇళ్ల నిర్మాణం మందగించి కార్మికులకు పనులు తగ్గాయని చెప్పారు. ఒకపక్క కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతుంటే వాటి ప్రభావంతో నిత్యావసరాల ధరలూ పెరుగుతున్నాయని, మరోవైపు సామాన్యులకు ఉపాధి దొరకని విధంగా ప్రభుత్వాల విధానాలను అమలు చేస్తున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రభుత్వాల విధానాలను ఎండగడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. సమస్యపై ఈనెల 16వ తేదీన మండల కేంద్రాల్లో ధర్నాలు చేస్తామని ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం మంచికలపూడిలో బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సూర్యారావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇ.అప్పారావు, ఎం.రవి, మండల కార్యదర్శి జె.బాలరాజు, నాయకులు ఎం.భాగ్యరాజు, వి.వెంకటేశ్వర్లు, బి.లక్ష్మణరావు, వివికె సురేష్‌, ఎన్‌.యోగేశ్వరరావు, సిహెచ్‌ పోతురాజు, బి.అమ్మిరెడ్డి, జి.శ్రీనివాసరావు, సాంబశివరావు, కె.కోటయ్య, కె.రాజేంద్రబాబు పాల్గొన్నారు. ప్రజానాట్య మండలి కళాకారులు డి.శ్రీనివాసరావు, మేరమ్మ తదితరులు గేయాలతో ఉత్సహ పరిచారు.