అనేక రకాల అవమానాలను, హింసను భరిస్తూనే ఆశా వర్కర్లు తమ విధులను నిర్వహిస్తున్నారు. మరోపక్క తమ సేవలకు సరైన గుర్తింపు, తమ హక్కుల సాధన కోసం సమ్మెలు, పోరాటాల ద్వారా నిరసనలను తెలియజేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ఆశా వర్కర్ల నిరసన కార్యక్రమాలను నేరపూరిత చర్యలుగా చూపెడుతూ, విధుల నుండి తొలగిస్తానని నోటీసులు ఇస్తోంది. నిరసన ప్రదర్శనలపై లాఠీచార్జీ చేసింది.
కోవిడ్-19 ప్రజల ఆరోగ్యాన్ని తలకిందులు చేసింది. ఈ వైరస్‌ని దీటుగా ఎదుర్కొనేందుకు ఆరోగ్య కార్యకర్తలు ముందు పీఠిన నిలబడి పోరాడారు. అయితే ప్రభుత్వం మాత్రం వీరి సేవని, త్యాగాన్ని గుర్తించటంలో ఇంకా వెనకముందాడుతోంది. తమ సేవలకు, శ్రమకు ప్రభుత్వం తగిన గుర్తింపునివ్వాలని దేశవ్యాప్తంగా ఆశా వర్కర్లు డిమాండు చేస్తున్నారు.
ప్రజావైద్యంలో మౌలిక వసతులు అసలే అంతంతమాత్రంగా వున్నాయి. ఆరోగ్య కార్యకర్తల పని పరిస్థితులు, సౌకర్యాలు ఎంత అధ్వాన్నంగా వున్నాయో కరోనా సమయంలో ప్రపంచానికి వెల్లడైంది. అనేక రాష్ట్రాలలో కరోనాను ఎదుర్కోవటంలో ప్రభుత్వాల అలసత్వాన్ని నిరసిస్తూ, తమ పరిస్థితులు మెరుగుపరచాలనే డిమాండ్‌తో ఆరోగ్య కార్యకర్తలు ఆందోళనలు చేశారు. ఈ నిరసనలలో ఆశాలు ముందంజలో ఉన్నారు. 2020 ఆగస్టులో దేశవ్యాప్తంగా వున్న ఆశా, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజనం తదితర స్కీమ్ వర్కర్లు 6 లక్షల మంది తమ వేతనాలు పెంచాలని, సకాలంలో చెల్లించాలని, మెరుగైన రక్షణ పరికరాలు అందించాలని, జీవిత బీమా కల్పించాలని కోరుతూ సమ్మె చేశారు.
2005లో ఏర్పాటు చేయబడిన 'జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం'లో ఆశా కార్మికులు సమాజానికి, ప్రజారోగ్య వ్యవస్థకు మధ్య వారధులుగా వుంటారని ప్రభుత్వం తెలిపింది. ప్రజారోగ్య వ్యవస్థలో మౌలిక సదుపాయాలు ప్రజలకు అందాలనే ఉద్దేశంతో నిర్దిష్ట పనులను నిర్వహించటానికి మహిళలను గౌరవ వేతనాలపై వాలంటీర్లుగా నియమించారు. వీరు ఆరోగ్య, పోషకాహార సంబంధిత సమాచారాన్ని ప్రచారం చేయటం, కుటుంబ ఆరోగ్య లెక్కలను సేకరించటం, నిర్వహించటం, జనన మరణాలను రికార్డు చేయటం, రోగ నిరోధక కార్యక్రమాలు లబ్ధిదారులకు చేరేలాగా చూడటం, అంటువ్యాధుల తనిఖీ, చికిత్స, బాలింతల సంరక్షణ, కుటుంబ నియంత్రణ మొదలైన అనేక పనులు చేస్తారు. వీరి పని గంటలు, బాధ్యతా రెండూ ఎక్కువే. కానీ గుర్తింపు కానీ, సరైన వేతనాలు కానీ లేవు. అందువల్ల ఆశా కార్మికులు తమకు గౌరవ వేతనం వద్దని, కనీస వేతనం కావాలని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ గత దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్నారు.
కోవిడ్-19 వ్యాప్తిని నియంత్రించే ప్రయత్నంలో ప్రభుత్వం ప్రజలకు పరీక్షలు నిర్వహించటం, వలస కార్మికులను పర్యవేక్షించి లక్షణాలను తనిఖీ చేయటానికి, ప్రజలు క్వారంటైన్ పాటిస్తున్నారా లేదా పరిశీలించటం, ఈ మొత్తం లెక్కలను సేకరించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నివేదించటం మొదలైన పనులన్నీ వారికి కేటాయించింది. అయితే ఈ విధానాన్ని నిర్వహించే క్రమంలో ఆశా కార్యకర్తలు అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నారు.
పని గంటలు పెరిగాయి. చాలీచాలని గౌరవ వేతనాలను కూడా సమయానికి చెల్లించలేదు. ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తున్న వీరికి కనీస ప్రాథమిక రక్షణ పరికరాలను సైతం ఇవ్వకపోవటం ప్రభుత్వానికి ఈ కార్మికుల పట్ల వున్న చిన్నచూపుకి ప్రత్యక్ష నిదర్శనం. చాలామంది కార్మికులు తమ రక్షణ పరికరాలను తామే స్వంతంగా కొనుక్కున్నారు. పిపిఇ కిట్లు, మాస్కులు, గ్లౌజులకు బదులు వారి 'దుపట్టాలనే మాస్కులుగా ఉపయోగించి' విధులు నిర్వర్తించారు.
ఆశా కార్మికుల పోరాటాన్ని కేవలం ఉపాధికి సంబంధించిన విషయంగా మాత్రమే చూడలేము. వీరిలో అనేకులు దళిత, మైనార్టీ ఆదివాసీ, వెనుకబడిన తరగతుల నుండి వచ్చారు. అందువల్ల కుల, పితృస్వామ్య విధానాల దాడి కూడా వీరిమీద తీవ్రంగా వుంటుంది. విధి నిర్వహణలో ఇంటింటికి వెళ్ళినప్పుడు, ఇరుగు పొరుగు వారు వీరిని అంటరానివారిగా చూస్తుంటారు. అదే సమయంలో పురుషులతో వ్యవహరించటం వీరికి మరింత కత్తి మీద సాము లాంటిది. వారి నుంచి తిట్లను, ఒక్కొక్కసారి భౌతిక దాడులను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఇది వారిని తీవ్ర మనస్తాపానికి గురిచేస్తోంది. ఇప్పటికే వారు అనుభవిస్తున్న సామాజిక అభద్రతను కరోనా మహమ్మారి మరింత తీవ్రతరం చేసింది.
ఇన్ని అవమానాలను, హింసను భరిస్తూనే ఆశా వర్కర్లు తమ విధులను నిర్వహిస్తున్నారు. మరోపక్క తమ సేవలకు సరైన గుర్తింపు, తమ హక్కుల సాధన కోసం సమ్మెలు, పోరాటాల ద్వారా నిరసనలను తెలియజేస్తున్నారు. 2020 నవంబర్ 26న జరిగిన దేశవ్యాప్త సమ్మెలో భాగస్వాములయ్యారు. అయినప్పటికీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ఆశా వర్కర్ల నిరసన కార్యక్రమాలను నేరపూరిత చర్యలుగా చూపెడుతూ, విధుల నుండి తొలగిస్తానని నోటీసులు ఇస్తోంది. నిరసన ప్రదర్శనలపై లాఠీచార్జీ చేసింది. యూనియన్ నాయకులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. వారిపై నిఘాను కూడా పెంచింది.
ప్రభుత్వాలు వైద్య ఆరోగ్యం, విద్యా రంగాలలో ప్రవేశ పెడుతున్న పథకాలను ప్రజలకు చేరవేయటంలో ఆశా వర్కర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. అయినా వారికి చట్టపరమైన హక్కులు, సౌకర్యాలు కల్పించి పర్మినెంట్ కార్మికులుగా గుర్తించటానికి మాత్రం ప్రభుత్వం ససేమిరా అంటోంది.
దేశ ప్రజారోగ్య వ్యవస్థ యొక్క బలహీనమైన పునాదులు ఆశా కార్మికుల భుజాలపై మోయలేని భారాన్ని వేస్తున్నాయి. దీనిని ఇకపై తల వంచుకుని సహించబోమని, తమ డిమాండ్లు సాధించుకునే వరకు నిరంతర ప్రతిఘటన, పోరాటాలు కొనసాగిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. తమ జీవితాలు ఆర్థికంగా, సామాజికంగా, సాంఘికంగా మారే వరకు తమ పోరు కొనసాగుతుందని ఘంటాపథంగా చెప్తున్నారు. ప్రభుత్వం కళ్ళు తెరవాలని, వారి న్యాయమైన డిమాండ్లు నెరవేరతాయని ఆశిద్దాం.
( 'ది వైర్' సౌజన్యంతో )










