Aug 12,2023 20:54

బోరుభద్ర వద్ద వంశధార కాలువలో పేరుకుపోయిన గుర్రపుడెక్కను పరిశీలిస్తున్న జెడ్‌పిటిసి పాల వసంత రెడ్డి, రైతులు

ప్రజాశక్తి-సంతబొమ్మాళి : ఆగస్టు వస్తే వంశధార అధికారులు వచ్చి హడావుడి చేసి వెళ్లి పోతారు తప్ప రైతులకు ఉపయోగం లేదని జెడ్‌పిటిసి పాల వసంతరెడ్డి, నాయకులు గొరుసు సవరయ్య, బుస్కల లక్షుమయ్య, బొంగు కొండయ్య, అట్టాడ అప్పలనాయుడు.. డిఇ సత్యనారాయణ, జెఇ అప్పలరెడ్డిని శనివారం నిలదీశారు. శనివారం బోరుభద్ర జిజి ఛానల్‌ నుండి పాలతలగాంలోని నూకలకనత వరకు సుమారు 6 కిలోమీటర్ల కాలువను అధికారులు, రైతులతో కలిసి వారు పరిశీలించారు. గట్టుపై నడుస్తూ గుర్రపుడెక్క పేరుకుపోవడం చూసి చలించిపోయారు. ఎండిపోతున్న పంటపొలాలు చూసి వంశధార అధికారులను గట్టిగా నిలదీశారు. బోరుభద్ర, కొల్లిపాడు, మేఘవరం, మరువాడ, కె.లింగూడు, మూలపేట పంచాయతీలకు నేటికీ సాగునీరు అందించని అధికారులు ఎందుకని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాలువలో గుర్రపుడెక్క తొలగించాలంటే ఏప్రిల్‌, మే నెలల్లో పని చేయాలని, కానీ ప్రతి ఏటా ఆగస్టులో హడావుడి చేయడం వల్ల ప్రయోజనం లేదని నిలదీశారు. రైతులకు ఎటువంటి అన్యాయం జరిగినా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నక్క బీమారావు, పరపటి శ్రీనివాస్‌, చింతాడ చిన్నారావు, రైతులు తిప్పాన రమణ, బర్ల రమణ, చలపతి, ముద్ద ఆనందరావు, తదితరులు పాల్గొన్నారు.