Sep 28,2023 21:02

గుర్రం జాషువా సేవలు చిరస్మరణీయం

రాయచోటి : గుర్రం జాషువా సేవలు చిరస్మరణీయమని జిల్లా పర్యాటక శాఖ అధికారి నాగభూషణం అన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గుర్రం జాషువా జయంతి నిర్వహించారు. జాషువా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాగభూషణం మాట్లాడుతూ 1895 సెప్టెంబర్‌ 28వ తారీకున ఉమ్మడి గుంటూరులోని వినుకొండ గ్రామంలో జన్మించారని పేర్కొన్నారు. గుర్రం జాషువా తన రచనల ద్వారా అణగారిన వర్గాలకు ఎన్నో సేవలందించారని, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారని తెలిపారు. లక్కిరెడ్డిపల్లి జూనియర్‌ కళాశాల అధ్యాపకుడు సహదేవరెడ్డి మాట్లాడుతూ గుర్రం జాషువా కవిత్వం అనే ఆయుధంతో సమాజాన్ని మేల్కొల్పారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి నాగరాజ, హౌసింగ్‌ పీడీ సాంబశివయ్య, జిల్లా ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారి అబ్‌ సలాం, కలెక్టరేట్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వాల్మీకిపురం: విప్లవ వీరుడు భగత్‌ సింగ్‌, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువ జయంతిని గురువారం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక అధ్యక్షులు ప్రభుచరణ్‌ స్థానిక డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో భగత్‌ సింగ్‌, గుర్రం జాషువ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ కల్పన, ఉపాధ్యాయులు, విద్యార్థినిలు పాల్గొన్నారు. పీలేరు: గుర్రం జాషువా సాహిత్యం సామాజిక మార్పుకు, సంఘ అభ్యుదయానికి తోడ్పడుతుందని వక్తలు తెలిపారు. తెలుగు భాషా సమితి సారధ్యంలో నవయుగ కవి చక్రవర్తి బిరుదాంకితుడైన గుర్రం జాషువా జయంతిని ఎపి బాలికల గురుకుల పాఠశాలలో ఇన్‌ఛార్జి ప్రధానాచార్యులు రేవతి అధ్యక్షతన నిర్వహించారు. జాషువా చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రిటైర్డ్‌ ప్రధానోపాధ్యాయులు సరస్వతి శ్రీరాములురాజు, తెలుగుభాషా సమితి అధ్యక్షులు సిఆర్‌పి జలకనూరి మురళీధర్‌ రాజు, సిఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకులు కోటా బాలాంజనేయులు, విఎస్‌ఎన్‌ సిధ్ధార్థ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు ఎన్‌.చలపతి నాయుడు, విద్యార్థులు పాల్గొన్నారు. రాజంపేట అర్బన్‌ :నవయుగ కవి చక్రవర్తి, పద్మభూషణ్‌ బిరుదాంకితులు మహాకవి గుర్రం జాషువా 128వ జయంతిని తెలుగు భాషా సంరక్షణ సమితి ఆధ్వర్యంలో స్థానిక జవుళీ బజారులోని సరస్వతీ విద్యా మందిరంలో నిర్వహించారు. జాషువా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో సమితి జిల్లా సహాయక కార్యదర్శి గంగనపల్లి వెంకటరమణ, తెలుగు భాషా సంరక్షణ సమితి ప్రతినిధులు బి.వినారాయణరాజు, రాయుడు, గుంటూరు రామయ్య, సుబ్రహ్మణ్యం, దయాకర్‌, ఉష, ప్రియాంక పాల్గొన్నారు.