కడప : ప్రముఖ రచయిత, కవి, సాహితీకారుడు, నవయుగ చక్రవర్తి గుర్రం జాషువా సేవలు ఎనలేనివని డిఆర్‌ఒ గంగాధర్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లోని స్పందన హాల్‌లో ప్రముఖ నవయుగ కవి, సాహితీకారుడు జాషువా జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి డిఆర్‌ఒ గంగాధర్ గౌడ్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1895వ సంవత్సరం సెప్టెంబర్ 28న గుంటూరు, ప్రస్తుతం పల్నాడు జిల్లా వినుకొండ మండలం చాత్రగడ్డపాడులో గుర్రం వీరయ్య, లింగమ్మ దంపతులకు జన్మించారన్నారు. చిన్నతనం నుంచి జాషువాలో సజనాత్మక శక్తి ఉండేదని, బొమ్మలు గీయడం, పాటలు పాడడం చేసేవాడిని, ఆయన 36 గ్రంథాలు, మరెన్నో కవితా ఖండికలు రాశారన్నారు. రుక్మిణి కల్యాణం, కోకిల, ధ్రువ విజయం, గబ్బిలం, ఫిరదౌసి, ఖండకావ్యాలు, తదితర అనేక రచనలు చేశాడని, కవితా విశారద, కవికోకిల, నవయుగ చక్రవర్తి, విశ్వకవి సామ్రాట్ గా బిరుదులు పొంది ప్రసిద్ధులైనారన్నారు కార్యక్రమంలో సిపిఒ వెంకట్రావు, జిల్లా టూరిజం అధికారి ఎస్. మల్లికార్జున, డిసిఒ సుభాషిణి, పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డా. శారదమ్మ, కలెక్టరేట్ ఎఒ విజరు కుమార్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ జ్ఞానేంద్ర, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. యుటిఎఫ్ ఆధ్వర్యంలో..
కడప అర్బన్ : కడప యుటిఎఫ్ భవన్ లో యుటిఎఫ్ ఆధ్వర్యంలో జాషువా జయంతి సంబరాలు గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆధునిక కవి, పండితులు మజ్జారి చెన్నకేశవులు జాషువా రచనలు - జీవితం - సామాజిక దక్పథంపై అనే అంశంపై ప్రసంగించారు. పాములకు పాలు, చీమలకు పంచదార పెట్టే పవిత్ర భారతదేశంలో పేదవాడికి ఒక్క మెతుకు కూడా అన్నం విదల్చక పోవడాన్ని గుర్రం జాషువా తీవ్రంగా నిరసించారని చెప్పారు. చాతుర్ వర్ణ వ్యవస్థలో భరతమాతకు పుట్టిన అయిదవ సంతానం నిమ్న జాతులని ఆనాటి వారి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు తెలిపారు. జాషువా రచనల స్ఫూర్తిని ప్రతి ఒక్కరు పొంది అణగారిన వర్గాలకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా ట్రెజరర్ నరసింహారావు, ఆడిట్ కమిటీ కన్వీనర్ ప్రభాకర్, నాయకులు సుజిత్, శ్రీనివాసులు, అనిల్ కుమార్, బాబు, సిద్దయ్య, శ్రీకాంత్,నాగరాజు పాల్గొన్నారు.










