Nov 30,2022 23:45

ఎస్‌.రాయవరంలో నివాళులర్పిస్తున్న గ్రామ నాయకులు

ప్రజాశక్తి -యస్‌.రాయవరం:మహాకవి గురజాడ సేవలు చిరస్మరణీయమని జెడ్పీటిసి కాకర దేవి కొనియాడారు. గురజాడ జన్మస్థలం యస్‌.రాయవరంలో ఆయన వర్ధంతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గురజాడ పౌండేషన్‌ నేతృత్వంలో గ్రామ నాయకులు బొలిశెట్టి గోవిందరావు, బృంద సభ్యులు గురజాడ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కన్యాశుల్కం నాటి సమాజంలోని పరిస్థితులను నేటికి కళ్ళకు కట్టినట్లు చూపిస్తుందన్నారు. ఆనాడే గురజాడ బాల్య వివాహాల పట్ల తన భావాలను నిర్ధ్వంధంగా తెలిపారన్నారు.అనంతరం స్కూల్‌ పిల్లలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్రీ వెంకటేశ్వరరావు మాస్టర్‌, ఏపీ, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్‌ ఎన్‌.వి అనంతకృష్ణ, కవి చింత రామకృష్ణారావు, వేగి మురళీకృష్ణ, కొణతాల శ్రీనువాసరావు, కర్రి ధనరెడ్డి, బొలిశెట్టి సర్పంచ్‌ భూపతి అప్పారావుచ, లక్కోజు ఆదిమూర్తి శ్రీనువాసరావు పాల్గొన్నారు.
భీమునిపట్నం : స్థానిక పండిట్‌ నెహ్రూ జివిఎంసి ఉన్నత పాఠశాలలో గురజాడ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి హెచ్‌ఎం తిరుమల శ్రీదేవి, ఆదర్శ హిందీ ప్రేమీ మండలి అధ్యక్షులు కెఎస్‌ఆర్‌ కృష్ణారావు, ఉపాధ్యాయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గాజువాక : నవయుగ వైతాళికుడు గురజాడ అని జనవిజ్ఞాన వేదిక విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌వికె.పరశరామ్‌ అన్నారు. సుందరయ్య కాలనీ, రవీంధ్ర ఇండియన్‌ పబ్లిక్‌ స్కూల్‌లో గురజాడ వర్థంతిలో పాల్గొని నివాళులర్పించారు. ఇన్‌ఛార్జిలు సుజాత, కిరణ్మయి పాల్గొన్నారు. చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ పురస్కారం ఇవ్వడాన్ని ఖండించారు.
ప్రజానాట్యమండలి ఆధ్వర్యాన...
ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ
నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు అని ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు చిరంజీవి అన్నారు. గురజాడ వర్థంతి సందర్భంగా బుధవారం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద గురజాడ విగ్రహానికి ఎఐఎస్‌ఎఫ్‌, ప్రజానాట్యమండలి నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు యు.నాగరాజు, ప్రజానాట్యమండలి నాయకులు అప్పన్న, దేవుడమ్మ, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.