ప్రజాశక్తి - బాపట్ల రూరల్
గురజాడ రచనలు స్ఫూర్తిదాయకమని ఎస్‌ఎఫ్ఐ పూర్వ నాయకులు, సీపీఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సీహెచ్ గంగయ్య అన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురజాడ అప్పారావు 161వ జయంతి సందర్భంగా స్థానిక జూనియర్ కళాశాలలో గురజాడ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గురజాడ అప్పారావు సాంఘిక దురాచారాలపై పోరాడిన సంఘసంస్కర్త అని అన్నారు. మహిళల అభ్యున్నతి కోసం కృషి చేసిన వ్యక్తని అన్నారు. ఎన్నో నాటికలు, కథలు, దేశభక్తి గేయాలు రచించారని అన్నారు. నేటి తరానికి ఆయన రచనలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని అన్నారు. విద్యార్థులు వాటిని చదివి అర్థం చేసుకోవాలని కోరారు. దేశ ఐక్యత కోసం, సమాజాభివృద్ధి కోసం కృషి చేయాలని అన్నారు. వితంతువులకు పునర్వివాహాలు చేయడం కోసం కృషి చేశారని అన్నారు. కన్యాశుల్కం కథను నాటిక రూపకల్పన చేసి ప్రదర్శించి స్త్రీలలో చైతన్యం తీసుకురావడం కోసం కృషి చేశారని చెప్పారు. దేశమును ప్రేమించమన్న మంచి అన్నది పెంచుమన్నా అనే దేశభక్తి గేయాన్ని రచించి దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని చాటిచెప్పి దేశభక్తిని రగిల్చారని అన్నారు. కానీ నేడు దేశంలో జరుగుతున్న విషయాలను పరిశీలిస్తే ప్రజలను మతాలు, కులాల వారీగా విడగొడుతూ విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలపట్ల విద్యార్ధులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మనోజ్ కుమార్ మాట్లాడుతూ నేటి విద్యార్థులు గురజాడ వంటి సంస్కర్తల జీవిత చరిత్రను తెలుసుకొని స్ఫూర్తి పొందాలని అన్నారు. సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడి స్త్రీ విద్య కోసం కృషి చేశారని అన్నారు. అందువల్లనే మహిళలు చదువుతోపాటు అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉన్నారని అన్నారు. గురజాడ వంటి సంఘసంస్కర్తలు చేసిన త్యాగాల ఫలితమే నేటి అభివృద్ది అని అన్నారు. నేడు సాంప్రదాయాల పేరుతో ముంచుకొస్తున్న ఆధునిక సాంఘిక వివక్షతకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడాలని కోరారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకురాలు సుభాషిని, కళాశాల స్టాఫ్ శీలం సాగర్ పాల్గొన్నారు.










