ప్రజాశక్తి-కలెక్టరేట్, విశాఖ: మనుషులను ప్రేమించాలని, మంచితనాన్ని పెంపొందించాలని, దేశమంటే మట్టికాదోరు, మనుషులు అని చెప్పిన నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, అందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని ఉత్తరాంధ్ర పట్టభద్రుల మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్.శర్మ అన్నారు. మహాకవి గురజాడ అప్పారావు 107వ వర్థంతి సందర్భంగా బుధవారం సాహితీ స్రవంతి ఆధ్వర్యాన విశాఖ ఆర్‌టిసి కాంప్లెక్స్ వద్ద ఉన్న గురజాడ విగ్రహ కూడలిలో సమావేశమయ్యారు. గురజాడ రాసిన దేశమును ప్రేమించుమన్నా దేశభక్తి గేయాన్ని సామూహికంగా ఆలపించారు. ముందుగా గురజాడ చిత్రపటానికి ఎంవిఎస్.శర్మ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వ్యవహారిక భాష ఉద్యమకారులైన గిడుగు, కందుకూరి, గురజాడ ఉత్తరాంధ్రకే చెందిన వారవడం మనందరికీ ఎంతో గర్వకారణమన్నారు. 112 ఏళ్ల క్రితమే దేశమును ప్రేమించుమన్నా అనే దేశభక్తి గేయాన్ని గురజాడ రాశారని తెలిపారు. శ్రమజీవుల చెమట చుక్కల వల్లనే సంపద సృష్టి అవుతుందన్నారని పేర్కొన్నారు. మహాకవి వర్థంతి సందర్భంగా ఆయన భావజాలాన్ని, ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ప్రతిజ్ఞ పూనుదామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల అప్పలరాజు (అరసం), రామకృష్ణ (విశాఖ రచయితల సంఘం), పి.రామారావు (సాహితీ స్రవంతి), జి.రాజేశ్వరరావు (అల్లూరి విజ్ఞాన కేంద్రం), గ్రంథాలయ పరిరక్షణ సంస్థ కార్యదర్శి బి.ఎల్ నారాయణ, ఐద్వా నాయకులు బి.పద్మ, వై.సత్యవతి, మణి, వరలక్ష్మి, పద్మజ, కుమారి, సంతోషం, కె.నిర్మల (అరుణోదయ) పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశభక్తి గేయంతోబాటు మరికొన్ని అభివృద్ధి గీతాలను ప్రజానాట్యమండలి ప్రతినిధులు ఎన్‌వి.రమణ, ఎం.చంటి బృందం సభ్యులు ఆలపించారు.










