ప్రజాశక్తి - బాపట్ల
అభ్యుదయ భావ విప్లవానికి గురజాడ అప్పారావు అడుగుజాడ తెలుగుజాతికి వెలుగు జాడని ఎంఈఓ ఎస్ నిరంజన్ కొనియాడారు. జెవివి సాంస్కృతిక విభాగం రాష్ట్ర నాయకులు కోటా వెంకటేశ్వరరెడ్డి ఆధ్వరంలో స్థానిక ఎంఈఓ కార్యాలయంలో మహాకవి గురజాడ 161జయంతి నిర్వహించారు. ఎంఈఓ నిరంజన్ మాట్లాడుతూ 1910లో గురజాడ రచించిన దేశభక్తి గీతం నేటి సమ కాలీన సమాజానికి మహోన్నత సందేశమని అన్నారు. గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గురజాడ దేశభక్తి గీతాన్ని అందరూ బృందంగా ఆలపించారు. గీతంలోని ప్రతి చరణంలో ఉన్న సారాంశాన్ని వివరించారు. జెవివి జిల్లా అధ్యక్షులు వై భాస్కరరావు మాట్లాడుతూ గురజాడ గొప్ప సంఘ సంస్కర్తని అన్నారు. కన్యాశుల్కం నాటకాన్ని రచించి బాల్య వివాహాలు, సాంఘిక దురాచారాలపై తన సాహిత్యం ద్వారా పోరాటం చేశారని అన్నారు. కార్యక్రమంలో యుటిఎఫ్ సీనియర్ నాయకులు నూతలపాటి కోటేశ్వరావు, ఎంఈఓ-2 డి ప్రసాద్, పద్మశ్రీ, హరిత, దేవయ్య, అనిల్, మాణిక్యరావు, కెవి నారాయణ, షేక్ మహబూబ్ సుభాని పాల్గొన్నారు.










