ప్రజాశక్తి-పాడేరు టౌన్: గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో గిరి పుత్రులు సత్తా చాటారు. విశాఖపట్నం వేపగుంట యూత్ ట్రైనింగ్ సెంటర్ ( వైటిసి )లో ఐటిడిఎ పిఒ ఆర్.గోపాలక్రిష్ణ కృషితో అందిస్తున్న సివిల్స్ శిక్షణను సద్వినియోగం చేసుకుని గిరిపుత్రులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈనెల 8న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు సివిల్స్ శిక్షణ పొందుతున్న 45 మంది అభ్యర్ధులు గ్రూప్-1 పరీక్షలు రాసారు. వీరిలో 12 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. అర్హత సాధించిన వారిలో టి.ఉదరు బాను, ఎస్.శ్రీనివాస్, వి.గోపిచంద్, ఎ.ఉమాసాయి, కె.సూర్యప్రకాష్, ఎవిఎస్ కీర్తి, పి.జయరాం, టి. భాస్కర్, ఎస్.ఇందిర కుమారి, బి.శ్రీహరి నాయుడు, కె.జాన్సీ, బి.నవ్య ఉన్నారు. ఈ సదర్భంగా ఐటిడిఎ పిఒ ఆర్.గోపాలక్రిష్ణ శనివారం అర్హత సాధించిన విద్యార్థులకు అభనందనలు తెలియజేసారు. మెయిన్స్ లో మంచి ర్యాంకులు సాధించి ఉన్నత స్థానాలు సాధించి అల్లూరి సీతారామరాజు జిల్లాకు, ఐటిడిఎకు మంచి పేరు తీసుకుని రావాలని కోరారు. పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరుస్తున్నారని ఇదే ఉత్సాహంతో ప్రతి ఒక్క గిరిజన విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రయత్నమే విజయానికి మొదటి గెలుపని చెప్పారు. ప్రతి అభ్యర్థి గెలుపు సాధించే వరకు సాధన చేయాలని, ఎవరూ ఎటువంటి నిరాశ, నిస్పహలకులకు లోనుకాకుండా చదువుకోవాలన్నారు. ఐటిడిఎ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సివిల్స్ లో ర్యాంకులు సాధించే సామర్ధ్యం, సత్తా గిరిజన విద్యార్థుల్లో ఉందని ఆనందం వ్యక్తం చేశారు.
పిఒ కృషి అభినందనీయం
సివిల్స్ చదవాలనుకునే ప్రతిభగల పేద, గిరిజన నిరుద్యోగ యువతీ, యువకుల అభ్యున్నతి కోసం ఐటిడిఎ పిఒ ఆర్.గోపాలక్రిష్ణ కృషి అభినందనీయమని టిడబ్ల్యూ టీచర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు అన్నారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో గిరి పుత్రులు అర్హత సాధించిన సందర్భంగా వారు మాట్లాడుతూ, గిరిజన విద్యార్థులు నైపుణ్యాలు ఉండి కూడా పేదరికంతో ఫీజులు చెల్లించలేక శిక్షణ పొందలేక పోతున్న అలాంటివారికి ఐటిడిఎ ద్వారా ఉత్తమ శిక్షణతో పాటు ఉచిత స్టడీ మెటీరియల్, భోజన వసతి, ఇంటర్నెట్ సౌకర్యాలు కల్పిస్తూ గిరిజన విద్యార్థుల అభ్యున్నతి కోసం పిఒ కృషి చేస్తున్నారన్నారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన గిరిజన అభ్యర్థులను టిడబ్ల్యూటియు రాష్ట్ర నాయకులు రీమలి జాన్, సిహెచ్ శ్రీనివాస్ పడాల్, పి.క్రిష్ణారావు, బావరాజు అప్పారావు, జివివి ప్రసాద్, ఆర్.సూర్యనారాయణ, జిల్లా నాయకులు కె.రామారావు, కె.నీలకంఠం తదితరులు అభినందించారు. మెయిన్స్, ఇంటర్వ్యూలోను ఉత్తీర్ణత సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.










