అది 1940 ఏప్రిల్1 సాయంత్రం కావస్తున్నది. సూర్యుడు మహేంద్రగిరి కొండలలోకి ఒరిగిపోతున్నాడు. మహేంద్రగిరి కొండల పాదాల చెంత ఉన్న మందసకు కూతవేటు దూరంలో ఒకవైపు బ్రిటిష్ పోలీసులకు మరోవైపు మందస జమిందారి పరిధి లోని 20 గ్రామాల రైతులకు మధ్య భీకర పోరు జరుగుతున్నది. బ్రిటిష్ పోలీసుల తుపాకుల నుండి దూసుకొస్తున్న తూటాలు రైతుల గుండెలను చీల్చుతున్నాయి. తమ సహచర రైతులు నేల కూలుతున్నా రైతులు ఏమాత్రం తగ్గకుండా పోలీసులను ఎదుర్కొంటున్నారు. రైతుల ధాటికి తట్టుకోలేక, ఈ పోరాటానికి నాయకత్వం వహిస్తున్న మహిళను చుట్టుముట్టి పోలీసులు గుళ్ల వర్షం కురిపించారు. తమ లక్ష్యం నెరవేరిందని భావించిన పోలీసులు, తమ అధికారులను సురక్షితంగా ఆ ప్రాంతం నుండి తప్పించారు. ఈ పోరాటంలో మహిళా నేతతో పాటు ఐదుగురు రైతులు, ఇద్దరు పోలీసులు ఘటనా స్థలంలో మరణించారు. మరో 15 రోజుల వ్యవధిలో తీవ్రంగా గాయపడిన 15 మంది రైతులు మరణించారు. అనంతరం అక్రమ కేసులు పెట్టి 42 మంది రైతులకు బ్రిటిష్ ప్రభుత్వం ఉరి శిక్షలు విధించింది. ఈ రైతాంగ పోరాటమే మందస జమిందారి వ్యతిరేక పోరాటంగా చరిత్రలో నిలిచింది. అశువులు బాసిన మహిళా నేత వీర గున్నమ్మగా సాసుమాను గున్నమ్మ పేరుగాంచింది.
భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో వీర గున్నమ్మకు సరైన స్థానం లభించలేదు.
''లీడర్స్ ఆర్ నాట్ బోర్న్.... దె ఆర్ మేడ్''. పుట్టుకతో ఎవరూ నాయకులు కారు... సమకాలీన సమాజమే వారిని తయారు చేస్తుంది. ఈ వాక్యం వీర గున్నమ్మకు నూటికి నూరుపాళ్ళు వర్తిస్తుంది. అప్పుడే భారత దేశంలో వేళ్లూనుకుంటున్న భారత కమ్యూనిస్టు పార్టీ, దాని నాయకత్వం లోని ఆల్ ఇండియా కిసాన్ సభ తయారుచేసిన వీర వనితే వీర గున్నమ్మ.
వీర గున్నమ్మ 1920 (తేదీపై స్పష్టత లేదు)లో మందస జమిందారి పరిధి లోని గుడారి రాజ మణిదేవ్‌పురంలో దుంపల కిష్టమ్మ, పారమ్మ దంపతులకు జన్మించింది. గున్నమ్మ పుట్టుకతోనే తల్లి పారమ్మ మరణించింది. దీంతో తండ్రి కిష్టమ్మే అన్నీ తానై గున్నమ్మను పెంచాడు. కిష్టమ్మ నిరక్షరాస్యుడు అయినప్పటికీ సమాజం పట్ల, సమాజంలో జరుగుతున్న పరిణామాల పట్ల కొంత అవగాహన కలిగివున్న వ్యక్తి. అందువలన గ్రామ సమస్యలతో పాటు, జమిందారి పరిధి లోని రైతాంగం ఎదుర్కొనే సమస్యలపై వారి ఇంటి దగ్గరే చర్చలు జరిగేవి. ఈ నేపథ్యంలోనే గున్నమ్మ బాల్యమంతా గడిచింది. గున్నమ్మకు యుక్త వయస్సు రాకముందే అదే గ్రామానికి చెందిన సాసుమాను మాధవయ్యతో వివాహం జరిగింది. మాధవయ్య చిన్నతనం లోనే ఉపాధికై రంగం (రంగూన్) వెళ్ళిపోయాడు.
మందస జమిందారి మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. 1758లో ఉత్తర సర్కార్‌ను బ్రిటిష్ వారు ఆక్రమించుకొని, జమిందారీలుగా విభజించి వేలం పాటలో కొనుక్కొన్న వారికి జమీన్లను అప్పగించారు. ఆ విధంగా ఉత్తర సర్కార్‌లో ఏర్పడిన జమీన్లలో ఒకటి మందస జమీన్. మందస జమిందార్లు రాజపుత్ర మూలాలు కలిగిన వారు. వీరి పేరు చివర రాజమణి దేవ్ అని వుండేది. వీరంతా విలాస పురుషులు, స్త్రీ లోలురు. జమీన్ పరిధిలో వచ్చే ఆదాయంలో అధిక భాగం వీరి విలాసాలకే వ్యయం అయ్యేది. వీరు బ్రిటిష్ వారికి అత్యంత విశ్వాసపాత్రులు. తమ విలాసాలకు రైతులపై శిస్తుల కోసం తీవ్ర నిర్భంధం విధించేవారు. రోజు రోజుకు శిస్తులకై జమిందారు విధించే నిర్బంధ చర్యలపై రైతు నాయకులు కిష్టమ్మ ఇంటి దగ్గరే చర్చించేవారు. ఈ నేపథ్యంలోనే గున్నమ్మ యుక్త వయస్సుకు వచ్చింది. జమిందార్ల దాష్టీకాల పట్ల వ్యతిరేకత పెరగసాగింది.
మందస జమిందారి వేధింపులకు వ్యతిరేకంగా జమీన్ పరిధిలో రైతు నాయకుడు మార్పు పద్మనాభం నాయకత్వంలో మందస జమీన్ రైతు సంఘం ఏర్పడి, అదనపు శిస్తు వసూళ్లకు వ్యతిరేకంగా రైతులను సమీకరించడం మొదలు పెట్టింది. రైతు సంఘం కార్యక్రమాలకు దుంపల కిష్టమ్మ ఇల్లే కేంద్ర బిందువు. రోజు రోజుకు జమిందారీ వ్యతిరేకత పెంచుకుంటున్న గున్నమ్మలో రైతు నాయకుల ప్రసంగాలు బలమైన ముద్ర వేయసాగాయి. మందస జమిందారు పట్ల రైతుల్లో తీవ్ర వ్యతిరేకత పెంపొందించడంలో రైతు సంఘం విజయం సాధించిందనే చెప్పాలి. ఎందుకంటే 1937లో మద్రాస్ ప్రెసిడెన్సీలో జరిగిన శాసన సభ ఎన్నికలలో రైతు సంఘం బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి పుల్లెల శ్యామసుందర రావు చేతిలో జమిందారు బలపరచిన జస్టిస్ పార్టీ అభ్యర్థి ఘోర పరాజయం పాలయ్యారు.
ఈ నేపథ్యంలో గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ రామలింగయ్య పార్టీ ఆర్గనైజర్‌గా ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చారు. ఆయన రాకతో పార్టీ కార్యక్రమాల్లో గుణాత్మక మార్పు రాసాగింది. మందస ప్రాంతంలో రైతు సంఘ కార్యక్రమాలు నిర్వహిస్తున్న మార్పు పద్మనాభం, పుల్లెల శ్యామసుందర రావు, గౌతు లచ్చన్న, బెందాళం గవరయ్య, గానుగుల తరుణాచారి మొదలగు వారితో రామలింగయ్య సంబంధాలను ఏర్పాటు చేసుకొని, రైతాంగ ఉద్యమం కొత్త పుంతలు తొక్కించారు.
ఆల్ ఇండియా కిసాన్‌సభ 5వ మహాసభలు 1940 మార్చి 27, 28 తేదీలలో పలాసలో జరిగాయి. మందస జమీన్ రైతులు ఎంతో ఉత్సాహంతో మహాసభల జయప్రదానికి కృషి చేశారు. గున్నమ్మ నాయకత్వంలో ఒక దళం అవిశ్రాంతంగా పనిచేసింది. మహాసభలు జరిగే రోజు రానే వచ్చింది. భారీ వేదిక ముస్తాబయ్యింది. వేదికకు ఒక వైపు సుత్తి కొడవలి గుర్తుతో ఎర్ర జండా, మరోవైపు త్రివర్ణ పతాకం ఎగరవేశారు. వేదికపై జాతీయ రైతు నాయకులు ఆశీనులయ్యారు. స్వామి దయానంద సరస్వతి, ఆచార్య ఎన్.జి రంగా, ఇందులాల్ యాగ్నిక్, నందేశ్వర శర్మ, తక్రార్ బాబా, పృధ్వి సింగ్, మోహన్ లాల్ గౌతమ్, వెంకట్రామా నాయుడు, జొన్నలగడ్డ రామలింగయ్య, భారతి రంగా మొదలగు వారు ఆశీనులయ్యారు. సభకు అధ్యక్షత వహించవలసిన రాహుల్ సాంకృత్యాయన్‌ను బీహార్ లో అరెస్ట్ చేయడంతో, స్వామి దయానంద సరస్వతి అధ్యక్షత వహించారు. బ్రిటిష్ వ్యతిరేక పోరాటాన్ని, జమిందారీ వ్యతిరేక పోరాటాన్ని జమిలి చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకు పోవాలని మహాసభ పిలుపునిచ్చింది. సభలో నాయకుల ఉపన్యాసాలు రైతులను ఎంతో ఉత్తేజితులను చేశాయి. ప్రత్యేకంగా మందస రైతులు ఊగిపోయారు. అంతే కాదు. తక్షణ కార్యక్రమం ప్రకటించి, మరుసటి రోజు మందస రైతు సంఘం సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. మరుసటిరోజు రోజు జరిగిన రైతు సమావేశంలో గున్నమ్మ ఉపన్యాసం రైతులలో వేడి రగిల్చింది. రేపే జమిందార్ అదుపు కొండలలో 100 బళ్ళతో కలప కొట్టుకొని రావాలని గున్నమ్మ చేసిన ప్రతిపాదనను రైతులంతా ఆమోదించారు. సమావేశం జరుగుతుండగా, ఓ ఐదుగురు రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి, గున్నమ్మ వద్ద తమ సమస్య చెప్పుకున్నారు. తాము రామారాయి కొండలలో కలప కొట్టామని, కానీ ఫారెస్ట్ గార్డ్ అడిగిన లంచం ఇవ్వనందున అదుపు కొండల నుండి కలప కొట్టామని ఫారెస్ట్ గార్డ్ రిపోర్ట్ ఇచ్చాడు. మమ్మల్ని రేపు ఫారెస్టు అధికారులు అరెస్ట్ చేయడానికి వస్తున్నారని, మీరే మమ్మల్ని రక్షించాలని వేడుకొన్నారు.
జమిందారుతో రేపే మన పోరాటం, అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులను ఊరి చివర వరకు తరిమి కొడదామని గున్నమ్మ చేసిన సూచనను అందరూ ఆమోదించారు. మరుసటి రోజు ఫారెస్ట్ అధికారులు గ్రామంలోకి వచ్చి, ఐదుగురు రైతులను బేడీలు వేసి, తీసుకుపోతుండగా గున్నమ్మ నాయకత్వంలో రైతులు ఫారెస్ట్ అధికారులను అడ్డగించి, రైతులను విడిపించి ఫారెస్ట్ అధికారులను గ్రామ పొలిమేరల వరకు తరిమి కొట్టారు. దీనితో ఉద్యమం తీవ్రంగా ఉందని భావించిన జమిందార్...జిల్లా కలెక్టర్ చక్రవర్తికి రైతు ఉద్యమాన్ని అణచివేయమని కోరుతూ వర్తమానం పంపారు. దీంతో కలెక్టర్ చక్రవర్తి, పోలీస్ సూపరిండెంట్ మునిలాల్ తో కలసి గున్నమ్మ ఉన్న గుడారి రాజమణి దేవ్ పురం గ్రామానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న గున్నమ్మ కలెక్టర్ కు ఎదురుగా నిలుచున్నది. గున్నమ్మను చూసిన కలెక్టర్... ఆ ఐదుగురు నిందితులను అప్పగించమని కోరాడు. వారిని నా కంఠంలో ప్రాణముండగా అప్పగించేది లేదని గున్నమ్మ స్పష్టం చేసింది. గున్నమ్మ కలెక్టర్‌తో మాట్లాడుతుండగా ఎస్.పి మునలాల్ హఠాత్తుగా గున్నమ్మపై కాల్పులు జరిపాడు. గున్నమ్మ తప్పుకున్నా తన స్నేహితురాలు పున్నమ్మకు గుండు తగిలి నేలకొరిగింది. దీంతో పోలీసులకు, రైతులకు యుద్ధం ప్రారంభమైంది. రైతులు వీరోచితంగా పోరాడారు. పోలీస్ కాల్పులలో గున్నమ్మతో పాటు గుంట చక్రపాణి, గుంట చిన్న నారాయణ, కలియాడు, గొర్ల జగ్గయ్య లు సంఘటనా స్థలంలో వీర మరణం పొందారు.
రైతు సంఘం జెండా అయిన ఎర్రజెండాను తమ గుండెలకు హత్తుకొని నేలకొరిగిన వీరులు వీరు. వారి ప్రాణ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ పోరుబాటలో నడవడమే వారికి నివాళి.
గూన అప్పారావు
వ్యాసకర్త : వీర గున్నమ్మ చిత్ర దర్శక, నిర్మాత










