Feb 07,2023 22:56

ప్రజాశక్తి-విజయవాడఅర్బన్‌: ఈ నెల 9, 10, 11 తేదీల్లో గుణదల మేరీమాత మహోత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని విజయవాడ కతోలిక పీఠం బిషప్‌ తెలగతోటి జోసఫ్‌ రాజారావు తెలిపారు. గుణదల సోషల్‌ సర్వీస్‌ సెంటర్‌ నందు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడచిన రెండు సంవత్సరాల నుంచి కోవిడ్‌ నేపద్యంలో గుణదల మాత మహోత్సవాలు వాయిదా వేయడం జరిగిందని చెప్పారు. కోవిడ్‌ అనంతరం నిర్వహిస్తున్న ఉత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి అంచనాలకు మించి యాత్రికులు తరలిరానున్నారని చెప్పారు. ఉత్సవాలను దష్టిలో ఉంచుకుని ముందుగా నవదిన ప్రార్ధనలు జనవరి 31వ తేదీ నుంచి ప్రారంభించామని తెలిపారు. నవదిన ప్రార్ధనలు ఫిబ్రవరి 8వ తేదీతో ముగియనున్నాయని చెప్పారు. 9వ తేదీ సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో మరియమాతను తేరు ప్రదక్షిణగా గుణదల పరిసర ప్రాంతాల్లో ఊరేగించనున్నట్లు తెలిపారు. మోన్సిన్యోర్‌ రెవ.ఫాదర్‌ మువ్వల ప్రసాద్‌ మాట్లాడుతూ గడచిన రెండు మాసాల నుంచి ఉత్సవాల ఏర్పాట్లపై సబ్‌ కలెక్టర్‌ సమక్షంలో అన్ని ప్రభుత్వ శాఖలతో సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగిందన్నారు. భద్రత విషయమై పోలీసు శాఖ, ఆరోగ్యం, శానిటరీ, తాగునీరు వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. కొండ దిగువన అంబులెన్స్‌ అలాగే కొండ ఎగువ భాగంలో అస్వస్థకు గురైన వారికి వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రైల్వేస్టేషన్‌, బస్టాండ్ల వద్ద యాత్రికుల సౌకర్యార్థం సమాచార కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. అనంతరం ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎస్సి డైరెక్టర్‌ ఫాదర్‌ సునీల్‌రాజు, వికార్‌ జనరల్‌ ఫాదర్‌ ఎం.గాబ్రియేలు, ఎడ్యుకేషన్‌ డెస్క్‌ డైరెక్టర్‌ ఫాదర్‌ కొలకాని మరియన్న, విచారణ గురువులు ఫాదర్‌ పసల థోమస్‌ తదితరులు పాల్గొన్నారు.