Aug 23,2023 23:59

ప్రత్తిపాడు-గొట్టిపాడు రహదారిలో లోతట్టు బ్రిడ్జీపై నుంచి ప్రవహిస్నున్న వర్షపునీరు

ప్రజాశక్తి -గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. గుంటూరులో కుండపోతగా వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షం నీరుపారింది. పల్లపు ప్రాంతాల్లో వర్షపునీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గుంటూరు, కాకుమాను, మేడికొండూరు, పొన్నూరు, వట్టిచెరుకూరు, పల్నాడు జిల్లా ముప్పాళ్ల, నర్సరావుపేట, చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల తదితర ప్రాంతాల్లో భారీ వర్షం, మిగతా ప్రాంతాల్లో ఒక మోస్తరుగా వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రతతో అల్లాడిన ప్రజలకు భారీ వర్షంతో చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. మరో వైపు వర్షాలతో జగనన్న కాలనీల్లో నీరు చేరింది. పల్నాడు జిల్లాలో ఇప్పటికీ ఈనెలలో అతి తక్కువ వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లాలో కొంత మేరకు వర్షపాతం మెరుగ్గా ఉంది. జిల్లాలో జూన్‌ మొత్తం 97.1 మిల్లీ మీటర్లవర్షం కురవాల్సి ఉండగా ఇప్పటివరకు 105.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జులైలో 164.9 మిల్లీమీటర్లకు గాను 255.2 మిల్లీమీటర్లు, ఆగస్టులో 164.7 మిల్లీ మీటర్లకు గాను బుధవారం వరకు 89.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. పల్నాడు జిల్లాలో జూన్‌ నెలలో 80.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 81.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జులైలో 131 మిల్లీ మీటర్లకుగాను 106.9 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఆగస్టులో 139.8 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 40.9 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.