ప్రజాశక్తి-గుంటూరు : జననన్న వసతి దీవెన పథకం కింద మొదటి ఆరు నెలలకు సంబంధించి గుంటూరు జిల్లాలో 36,697 మంది విద్యార్థులకు రూ.35.27 కోట్లు జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. బుధవారం అనంతపురం జిల్లా నార్పల నుంచి సిఎం జగన్మోహన్‌రెడ్డి జగనన్న వసతి దీవెన నిధులు జమ చేసే కార్యక్రమం నిర్వహించగా గుంటూరు కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శాసనమండలిలో చీఫ్‌విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ హెనీక్రిస్టినా, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్ధాళి గిరిధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదార్లకు మెగా చెక్కును అందిం చారు. కార్యక్రమంలో రాష్ట్ర కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ మండేపూడి పురుషోత్తం, రాష్ట్ర కృష్ణ బలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ కోలా భవానీ మణికంఠ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బత్తుల దేవానంద్ పాల్గొన్నారు.
ప్రజాశక్తి - నరసరావుపేట : వసతి దీవెన కింద పల్నాడు జిల్లాలో 38,404 మంది విద్యార్థులకు రూ.37.07 కోట్లు జమైనట్లు పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలను నుండి కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం, సాంఘిక సంక్షేమ అధికారి ఓబులు నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు విడతలుగా ఐటిఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సుల విద్యార్థులకు రూ.20 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని వివరించారు.










