ప్రజాశక్తి -గుంటూరు జిల్లా ప్రతినిధి : నైరుతీ రుతు పవనాల ప్రభావంతో గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. గుంటూరులో కుండపోతగా వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షం నీరుపారింది. పల్లపు ప్రాంతాల్లో వర్షపునీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గుంటూరు, కాకుమాను, మేడికొండూరు, పొన్నూరు, వట్టిచెరకూరు, ముప్పాళ్ల, రొంపిచర్ల, శావల్యాపురంలో భారీ వర్షం కురిసింది. మిగతా ప్రాంతాల్లో ఒక మోస్తరుగా వర్షం కురిసినట్టు సమాచారం అందింది. మేడికొండూరులో గత నెలలో జిల్లా మొత్తం మీద అధిక వర్షం కురవడం వల్ల రైతులు సేద్యానికి సిద్ధం కాగా తాజాగా కురిసిన వర్షంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత పది రోజులు వర్షాల జాడలేక ఎండల తీవ్రతతో అల్లాడిన ప్రజలకు భారీ వర్షంతో చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. మరో వైపు వర్షాలతో జగనన్న కాలనీల్లో నీరు చేరింది. గుంటూరు,కాకుమాను, మేడికొండూరు పరిసరాల్లోని జగనన్న కాలనీల్లో నీరు చేరి నిర్మాణ పనులకు ఆటంకం కల్గించింది. జూన్ నెలలో గుంటూరు,పల్నాడు జిల్లాల్లో చాలావరకు సాధారణ వర్షంపాతం నమోదు కాగా 27 మండలాల్లో లోటు పరిస్థితి ఏర్పడింది. తాజా వర్షాలతో గతనెలలో వర్షాలు కురవని ప్రాంతాల్లో ఇప్పుడు కురుస్తున్న వర్షంతో రైతులకు కొంత ఉపశమనం కల్గింది. మంగళవారం కూడా వర్షాలు కొనసాగే అవకాశంఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గుంటూరు జిల్లాలో జూన్ నెల మొత్తం 97.1 మిల్లీ మీటర్లవర్షం కురవాల్సి ఉండగా ఇప్పటివరకు 105.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. పల్నాడుజిల్లాలో జూన్ నెలలో 80.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 81.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. దీంతో ఇంకా సేద్యం ప్రారంభించడానికి రైతులు తటపటాయిస్తున్నారు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఇంకా సేద్యం ఊపందుకోలేదు. పల్నాడు జిల్లాలో 3.04 లక్షల ఎకరాలకు గాను 20 వేల ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటారు. భారీ వర్షాలు రెండు రోజులు కొనసాగితే సాగుకు ఉపయోగంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.










