ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : వేసవి తీవ్రత నుంచి ప్రజలకు తాత్కాలిక ఉపశమనం కలిగింది. మూడ్రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. పగటి సమయంలో గరిష్టంగా 40 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతోంది. శనివారం ఉదయం కొంత మేరకు ఎండ తీవ్రత ఉన్నా మధ్యాహ్నం కల్లా భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారింది. వేసవిలో చల్లని వాతావరణం ఏర్పడటంతో ప్రజలు సేదతీరారు. తాడికొండ, తుళ్లూరు మండలాల్లో గాలి దుమారంతో ఒక మోస్తరుగా వర్షం కురిసింది. గుంటూరు మిర్చి యార్డుకు సెలవు కావడంతో యార్డు కార్మికులు ఎవ్వరూ లేరు. కొన్ని దుకాణాల్లో మాత్రం వర్షం వల్ల నీరు చేరి కొన్ని బస్తాలు పాక్షికంగా తడిశాయి.










