ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా ఐదవ ఏడాది మొదటి విడతగా కౌలు రైతులకు వైయస్సార్ రైతు భరోసా, మే నుండి ఆగష్టు నెల వరకు కురిసిన అధిక వర్షాలకు నష్టపోయిన రైతన్నలకు ఇన్ పుట్ సబ్సిడీ నిధుల మంజూరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని గుంటూరు కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా, జీడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు, రాష్ట్ర కుమ్మరి, శాలివాహన కార్పొరేషన్ మండేపూడి పురుషోత్తం పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్, జెడ్పీ చైర్‌పర్సన్ తదితరులు రైతు భరోసా ద్వారా ఐదవ సంవత్సరం మొదటి విడతలో 6,987 మంది కౌలు రైతులకు మంజూరు చేసిన రూ.5.240 కోట్ల మెగా చెక్కును అందచేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.వెంకటేశ్వర్లు, ఉద్యాన శాఖాధికారి రవీందర్, కౌలు రైతులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో ఎస్‌ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి వర్చువల్‌గా జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సాయిమార్కొండారెడ్డి పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలో 18747 మందికి రూ.14.6 కోట్ల మెగా చెక్కును లబ్ధిదార్లకు అందించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఐ.మురళి మాట్లాడుతూ కౌలు రైతులకు రూ 7.5 వేలు చొప్పున మొదటి విడతగా జమ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయ సహాయ సంచాలకులు సిహెచ్ రవికుమార్, నరసరావుపేట, వినుకొండ సహాయ వ్యవసాయ సంచాలకులు మస్తానమ్మ, బి.రవిబాబు పాల్గొన్నారు.










