
ప్రజాశక్తి-కూనవరం
వర రామచంద్రాపురం మండల రేఖపల్లి నుండి కూనవరం మీదుగా విజయవాడ, గుంటూరుకు బస్సు సర్వీస్ నడపాలని కూనవరం గ్రామానికి చెందిన నాయకులు సోమవారం విజయవాడ వెళ్లి ఎపిఎస్‌ఆర్‌టిసి డిపిటిఒను కలిసి వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు భద్రాచలం డిపో వారు విజయవాడ, గుంటూరు వెళ్ళడానికి కూనవరం, విఆర్.పురం నుండి బస్సు సర్వీస్ నడిపేవారని, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ సర్వీసును రద్దు చేశారని తెలిపారు. అప్పటి నుండి కూనవరం, విఆర్.పురం మండలాలకు విజయవాడ బస్సు సౌకర్యం లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బస్సు సర్వీసు ఏర్పాటు చేస్తే వ్యాపారస్తులకు, మిర్చి రైతులకు, ఉద్యోగస్తులకు, అందరికీ ఎంతో సౌకర్యార్థకరంగా ఉంటుందని చెప్పారు. ఈ రెండు మండలాలకు బస్సు సౌకర్యం గురించి గతంలో అనేకసార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. దానికి డిపిటిఒ సానుకూలంగా స్పందించి రూటు పరిశీలించి ఏర్పాటు చేస్తామని తెలియజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు వెంకట్రావు, ఎంవివి రాజు, నాగేశ్వరరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.