Aug 17,2023 22:08

శిల్క్‌ షాపు గుమస్తాతో మాట్లాడుతున్న నాయకులు

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : గుంటూరుకు చెందిన కాంచిపురం మురగన్‌ శిల్క్‌ షాపు గుమస్తా శ్రీకాంత్‌ను ధర్మవరం పట్టుచీరల వ్యాపారులు గురువారం పట్టుకుని బంధించారు. నెలక్రితం విజయవాడలో ధర్మవరం పట్టుచీరల వ్యాపారులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. దీంతో ధర్మవరం పట్టుచీరలవ్యాపారులు ఆందోళన చేపట్టడంతోపాటు వివిధ రాజకీయ పార్టీలనాయకులు కూడా తీవ్రంగా ఖండించారు. దీంతో విజయవాడ ఘటన తెలుగురాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది. దీంతో ఆలయ శిల్క్‌ యజమానిపై పోలీసు అధికారులు చర్యలు కూడా చేపట్టారు. దీంతో అప్రమత్తమైన ధర్మవరం పట్టుచీరల వాప్యారులు అసోషియేషన్‌ ఏర్పాటుచేసుకుని వివిధ ప్రాంతాలలో ఉన్న బకాయిలను చట్ట ప్రకారమే వసూలు చేయడానికి శ్రీకారం చుట్టారు. గుంటూరుకు చెందిన కాంచిపురం మురగన్‌ శిల్క్‌ షాపు యజమాని వంశీవర్మ ధర్మవరం పట్టుచీరల వ్యాపారులకు రూ.3 కోట్ల దాకా అప్పు ఉన్నాడు. విడతల వారిగా ఇప్పటి వరకు రూ.1.50 కోటి బకాయి చెల్లించారు. ఇంకా రూ.1.50కోటి వరకు బకాయి ఉంది.ఆ మొత్తం ఇవ్వకుండా దాదాపు 10నెలల నుండి తిప్పుకుంటున్నారని ధర్మవరం పట్టుచీరల వ్యాపారులు చెబుతున్నారు. ఈ నేపథయంలో ఆ షాపు గుమస్తా గురువారం పట్టుచీరల కోసం ధర్మవరానికి వచ్చాడు. దీంతో ఆయనను చూసిన పట్టుచీరల వ్యాపారులు పట్టుకుని ధర్మవరం వ్యాపారుల అసోషియేషన్‌ ప్రతినిధుల వద్దకు పిలుచుకుని వెళ్లారు. ధర్మవరం వ్యాపారులకు ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని, మీ యజమానిని పిలిపించాలని గుమస్తా పై ఒత్తిడితెచ్చారు. దీంతో ఆ గుమస్తా వారి యజమానితో మాట్లాడి 15 రోజులలో బకాయిలు చెల్లిస్తామని చెప్పారు.