Sep 11,2023 23:48

వర్షాలకు నీట మునిగిన తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని ఆకుకూర మడులు

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు దాదాపు అన్ని మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీవర్షం కురిసింది. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఈ వర్షం వ్యవసాయానికి బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ప్రధానంగా పల్నాడు జిల్లాలో బెట్టకొచ్చిన పైర్లకు ఈ వర్షం మేలు చేకూరుస్తుందని అధికారులు తెలిపారు. నెల రోజుల్లో కురవాల్సిన వర్షం ఒక్క రోజులోనే కురిసిందని అధికార వర్గాలు తెలిపాయి. మెట్ట ప్రాంతంలో మిర్చి సాగుకు ఈ వర్షం బాగా ఉపయోగపడుతుందని రైతులు ఆశాభావంతో ఉన్నారు.
గుంటూరు జిల్లాలో సెప్టెంబరులో 145.2 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా సోమవారం వరకు 161.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం విశేషం. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. తాడికొండ 111.6, మంగళగిరి 107, దుగ్గిరాల 103.4, పొన్నూరు 101.8, తాడేపల్లి 98.6, కొల్లిపర 95.2, తుళ్లూరు 94.2, పెదకాకాని 71.8, ప్రత్తిపాడు 60.4, గుంటూరు ఈస్టు 45.6, మేడికొండూరు 44, గుంటూరు పశ్చిమ 42, వట్టిచెరుకూరు 38.4, కాకుమాను 32.4, చేబ్రోలు 32, తెనాలి 29.2, పెదనందిపాడు 28.4, ఫిరంగిపురం 26.8 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది. పల్నాడు జిల్లాలో ఈనెలలో 134.5 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా ఇప్పటి వరకు 130.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గత నాలుగు నెలల్లో అవసరాని కంటే అధికంగా వర్షం కురిసింది ఈ నెలలోనేనని అధికారులు తెలిపారు.
మండలాల వారీగా గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. పెదకూరపాడు 116.4, క్రోసూరు 98, మాచర్ల 90.2, గురజాల 85.2, ఈపూరు 72.2, బొల్లాపల్లి 71.8, దుర్గి 70.8, అచ్చంపేట 60.6, పిడుగురాళ్ల 47.4, నర్సరావుపేట 46.6, అమరావతి 46.4,మాచవరం 45.6, వెల్దుర్తి 43, ముప్పాళ్ల 36.4, శావల్యాపురం 36.2, యడ్లపాడు 35.2, దాచేపల్లి 34, కారంపూడి 33.4, నాదెండ్ల 30.4, సత్తెనపల్లి 29.2, రెంటచింతల 26.2, చిలకలూరిపేట 25.4 మిల్లీమీటర్లు నమోదైంది.