ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సాధారణ సమావేశం శుక్రవారం వాడీవేడిగా జరిగింది. పలు అంశాలపై టిడిపి, వైసిపి కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వావాదం చోటుచేసుకుంది. ఒక దశలో ఘర్షణ వాతావరణం అలుముకుంది. గాంధీపార్కులో అభివృద్ధి పనుల పేరుతో చోటుచేసుకున్న అవినీతి, గుంటూరులో తాగునీటి ఎద్దడి, కుక్కల బెడద, అభివృద్ధి పనుల్లో జాప్యం, ప్రొటోకాల్ పాటించకపోవడం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. గాంధీ పార్కు అభివృద్ధికి చేపట్టిన పనులు ఏమిటీ? ఎంత కేటాయించారు? ఈ పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయి? అని ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు లిఖితపూర్వకంగా ప్రశ్నించారు. ఈ అంశంపై చర్చ ప్రారంభం కాగానే గాంధీ పార్కు అభివృద్ధిపై నిధులు ఎలా మంజూరు చేశారని, కౌన్సిల్ ఆమోదం పొందారా అని టిడిపి కార్పొరేటర్లు ఈరంటి వరప్రసాద్, కోవెలమూడి రవీంద్ర ప్రశ్నించడంతో అధికా రులు పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. ఈ పనులకు ఎప్పుడు అనుమతి ఇచ్చారు? నిధులు ఎప్పుడు మంజూరు చేశారనే అంశంపై ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు కోటేశ్వరరావు పొంతనలేని సమాధానాలు ఇవ్వడంపై టిడిపి, వైసిపి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ దశలో ప్రస్తుత కౌన్సిల్‌లోనే రహస్యంగా రూ.1.90 కోట్లకు అనుమతిచ్చారని కార్పొరేటర్ వరప్రసాద్ ఆరోపించడంతో వైసిపి కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసిపి కార్పొరేటర్ సంకురు శ్రీనివాసరావు, మరికొందరు టిడిపి కార్పొరేటర్లపైకి దూసుకువచ్చారు. కోవెలమూడి రవీంద్రపై దాడికి ప్రయత్నించడంతో ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వాదప్రతిపాదనలతో కౌన్సిల్ సమావేశం అట్టుడుకింది. ఒకరిపై మరొకరు వ్యక్తిగత ఆరోపణలు చేసుకున్నారు. కార్పొరేటర్ సంకురు శ్రీనివాసరావుపై టిడిపి కార్పొరేటర్ వేములపల్లి శ్రీరాం ప్రసాద్ వ్యక్తిగత విమర్శ చేయడం ఘర్షణకు దారితీసింది. ఈ సందర్బంగా టిడిపి, వైసిపి కార్పొరేటర్లను డిప్యూటీ మేయర్ బాలవజ్రబాబు సర్ధి చెప్పారు. అధికారులు సమాధానం సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఇప్పుడే నిద్రలేచి వచ్చినట్టు సమాధానం చెబుతారేంటి? అని ప్రశ్నించారు. కౌన్సిల్ సమావేశం అంటే అధికారులకు లెక్కలేదని ఏ అంశంపైనా హోం వర్కు లేకుండా వస్తున్నారని రవీంద్ర విమర్శించారు. చారిత్రక ప్రదేశంగా ఉన్న గాంధీ పార్కు అభివృద్ధి విషయంలో అవినీతి జరిగినట్టు మీడియాలో వార్తలు వచ్చాయని అవినీతికి ఆస్కారం లేకుండా త్వరగా పూర్తి చేయాలని కోరారు. తాజా కౌన్సిల్ ఏర్పడకముందే ఆమోదం లభిస్తే ఇప్పుడు ఆమోదం పొందినట్టు అవినీతి జరిగినట్టు జిల్లా కలెక్టర్‌కు టిడిపి నాయకులు స్పందనలో ఫిర్యాదు చేసినట్లు వజ్రబాబు చెప్పారు. అసలు పార్కు పునరుద్ధరణ పనులపై స్థానిక ఎమ్మెల్యే ముస్తఫాకు కనీస సమాచారం ఇచ్చారా? అని అధికారులను ప్రశ్నించగా అధికారులు మౌనం వహించారు. తాను అవినీతికి పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే ముస్తాఫా ఖండించారు. తాను 40 ఎకరాలు పొలం అమ్ముకుని రెండుసార్లు ఎమ్మెల్యేను అయ్యాయని అన్నారు. తనపై టిడిపి కార్పొరేటర్లు, నాయకులు కావాలని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
నగరంలో తాగునీటి సమస్య పై నిలదీసిన టిడిపి కార్పోరేటర్ లు నిలదీశారు. నీటి ఎద్దడికి టిడిపి నేతలే కారణమని వైసిపి కార్పొరేటర్లు అనడంతో మరోసారి ఘర్షణ వాతావరణం తలెత్తింది. తొలుత ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ గత నెల రోజులుగా నగరంలో మంచినీటి సరఫరా సరిగా లేని విషయం వాస్తవమేనా? తీసుకున్న చర్యలు ఏమిటీ? గోరంట్ల రిజర్వాయర్ ఎప్పుడు పూర్తి చేస్తారని ప్రశ్నించారు. ఇందుకు అధికారులు ఉండవల్లి రా వాటర్, మంగళగిరి పంపుహౌస్‌లు నీటి సరఫరాలో ఏర్పడుతున్న ఇబ్బందులు, విద్యుత్ సమస్యలను వివరించారు. నీటి ఎద్దడి పరిష్కారం కోసం అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని లక్ష్మణరావు కోరారు. పట్టాభిపురం, స్తంభాల గరువు తదితర ప్రాంతాల్లో రోజుకు అర్ధగంట కూడా నీరు రావడం లేదన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో నీరు రావడంలేదని తరచూ ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. విద్యుత్ సమస్య ప్రతి ఏటా వేసవిలో ఉంటుందని, జనరేటర్లు లేకపోతే ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే ముస్తాఫా మాట్లాడుతూ రిజర్వాయర్లలో మట్టి పేరుకుపోయిందని, తొలగించాలని కోరారు. ఎస్‌ఇ భాస్కరరావు మాట్లాడుతూ ట్యాంకులను ప్రతినెలా శుభ్ర పరుస్తున్నారని, ఒక్కటి రెండు చోట్ల మట్టి ఉంటే తొలగిస్తామని అన్నారు. ముస్తాఫా ప్రతిస్పందిస్తూ ప్రతి ట్యాంకులో కూడా రెండు లారీల మట్టి పేరుకుపోయిందన్నారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ నల్లపాడు చెరువును అభివృద్ధి చేసి వినియోగించుకుంటే కొన్ని ప్రాంతాలకు నీటి ఎద్దడి తగ్గుతుందన్నారు. బిఆర్ స్టేడియం ట్యాంకు కూలిపోవడానికి సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే ముస్తాఫా అన్నారు. 18 నెలల్లో బిఆర్ స్టేడియం ట్యాంకరు నిర్మిస్తామని ఎస్‌ఇ తెలిపారు. కమిషనర్ చేకూరి కీర్తి మాట్లాడుతూ గోరంట్ల రిజర్వాయర్ నిర్మాణం పూర్తి కావాల్సి ఉందన్నారు. దీనినిపూర్తి చేస్తే టిడ్కోకు పూర్తిగా నీరు అందిస్తామన్నారు. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా రూ.170 కోట్లతో మరో 50 ఎంఎల్‌డి నిల్వ సామర్ధ్యంతో మరో పంపుహౌస్ నిర్మాణం చేపడతామన్నారు. ఎమ్మెల్యే గిరిధర్ మాట్లాడుతూ 2013లో రూ.460 కోట్లతో 15 లక్షల మందికి తాగునీటి అందించేందుకు రూపొందించిన పథకం పూర్తయినా ఇప్పటికీ నీటి ఎద్దడి ఉండటం బాధకరమన్నారు. ప్రస్తుతం నగర జనాభా 9.50 లక్షల మంది ఉన్నారని అయినా నీటి సరఫరాలో రోజూ ఇబ్బందులు వస్తున్నాయన్నారు. మేయర్ కావటిమనోహర్ నాయుడు మాట్లాడుతూ నీటిఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. వేసవి ముగిసిన తరువాత నీటి ఎద్దడిపై చర్చించడం విచారకరమని పలువురు కార్పొరేటర్లు విమర్శించారు. నగరంలో కుక్కల బెడదపై డిప్యూటీ మేయర్ షేక్ సజీల తీవ్ర నిరసన తెలిపారు. ఒక చిన్నారి మెడను కుక్క కరచిన ఘటనతోకూడిన ఫ్లెక్సీని ఆమె సమావేశంలో ప్రదర్శించి కన్నీరు పెట్టుకున్నారు. అధికారులు కనీసగౌరవం ఇవ్వడంలేదని, ప్రొటోకాల్ పాటించడం లేదని అన్నారు. అధికారిక సమాచారాలన్నీ డిప్యూటీ మేయర్‌లకు తెలపాలని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లను మేయర్ ఆదేశించారు. సమావేశం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగింది. అజెండా పూర్తికాకపోవడంతో సమావేశాన్ని శనివారానికి వాయిదా వేశారు.
ఐ ప్యాక్ బృందాన్ని బయటకు పంపిన టిడిపి
ప్రశాంత్ కిషోర్ టీమ్‌కు చెందిన ఐప్యాక్ టీమ్ సభ్యులు సమావేశంలో అధికారుల పక్కన కూర్చొవడంపై టిడిపి కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. టిడిపి కార్పొరేటర్లు కోవెలమూడి, బుజ్జి తదితరులు వారిని బయటకు పంపాలని కోరారు. టిడిపి కార్పొరేటర్లు స్వయంగా వచ్చి వారిని బయటకు పంపారు. వీరిని వైసిపి ప్రజా ప్రతినిధులు తమ కారులో బయటకు పంపారు.
బోగస్ ఓట్లపైటిడిపినిరసన
నగరంలో ఒకే డోర్ నంబర్‌పై ఉన్న ఓట్లను తొలిగించాలని టిడిపి కార్పొరేటర్లు ప్లేకార్డుల ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. అయితే టిడిపి వారు చెప్పినట్టు అవి బోగస్ ఓట్లు కాదని, 2019 ముందు నుంచే ఒకే డోర్ నంబరులో 400 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారని అదనపు కమిఠషనర్ తెలిపారు. ఈ అంశంపై చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ టిడిపి బోగస్ ఓట్ల వల్లే తాను ఓడిపోయాయని అన్నారు.










