ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండగా పల్నాడు జిల్లాలో ఒక మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి. పల్నాడు జిల్లాలో వర్షాల ప్రభావం తక్కువగా ఉండటంతో రైతులు నిరాశకు గురవుతున్నారు. గుంటూరు జిల్లాలో మాత్రం ఆది, సోమవారాల్లో ఒక మోస్తరు నుంచిభారీ వర్షాలు కురిశాయి. మంగళవారమూ అతి భారీ వర్షం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. సోమవరం గుంటూరు, కొల్లిపర, దుగ్గిరాల, తాడికొండ, తెనాలి, పెదకాకానిలో కుండపోతగా వర్షం కురిసింది. జూన్ నెలలో గుంటూరు జిల్లాలో 97.1 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 105 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. జులైలో 164 మిల్లీ మీటర్లు నమోదు కావాల్సి ఉండగా ఇప్పటికే 195 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. పల్నాడుజిల్లాలో జూన్ నెలలో 80.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 81.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జులైలో 131 మిల్లీ మీటర్లకు సోమవారం వరకు 63.2 మిల్లీ మీటర్ల వర్షపాతమే నమోదైంది. జిల్లాలో గత వారం రోజులుగా ముసురు పట్టింది. శనివారం వరకు రెండు జిల్లాలో జల్లులతో కూడిన స్వల్పవర్షం కురవగా గత రెండు రోజుల్లో వర్షాలు ఊపందుకున్నాయి. పల్నాడు జిల్లాలో ముప్పాళ్ల, నకరికల్లు, పెదకూరపాడులో మోస్తరుగా వర్షం కురిసింది. గత 24 గంటల్లో కొల్లిపరలో అత్యధికంగా 83.2, దుగ్గిరాల 67.8, తాడికొండ 56.2, తెనాలి 54.2, పెదకాకాని 50, మంగళగిరి 47.6. చేబ్రోలు 47.6, తాడేపల్లి 32.4, గుంటూరు పశ్చిమ 36.4. గుంటూరు తూర్పు 30.4, వట్టిచెరకూరు 21.2, పొన్నూరు 19.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గతవారం రోజులుగా నాన్పుడు వానకు రవడం వల్ల రహదారులన్నీ బురదమయంగా మారాయి. తాజగా భారీ వర్షాలతో చాలా రోడ్లు మరింత దెబ్బతిన్నాయి. రోడ్లపైకి నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. భారీ వర్షం కురిసిన తరువాత రెండు గంటల పాటు గుంటూరులోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. డెల్టాలో భారీవర్షాలతో వెదపద్ధతిలో సాగు చేసిన వరిపంటకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.










