
ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 17,37,447 మంది ఓటర్లున్నారు. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు స్పెషల్ సమ్మరీ రివిజన్-2024 డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.వేణుగోపాల్‌రెడ్డి గురువారం విడుదల చేశారు. దీని ప్రకారం జిల్లాలో పురుష ఓటర్లు 8,39,405 మంది, మహిళా ఓటర్లు 8,95,178 మంది, థర్డ్ జెండర్ 214 మంది ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 55,773 మంది అధికంగా ఉన్నారు. ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు పురుషులు 637 మంది, స్త్రీలు 185 మంది ఉన్నారు. సర్వీసు ఓటర్లు పురుషులు 1754 మంది, స్త్రీలు 74 మంది ఉన్నారు.
ఈ ముసాయిదా జాబితాపై ఈనెల 27 నుండి డిసెంబర్ 9వ తేదీ వరకూ క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణకు నవంబర్ 4, 5, డిసెంబర్ 2, 3 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్‌లు నిర్వహిస్తారు. డిసెంబర్ 26న క్లెయిమ్‌లు, అభ్యంతరాలు పరిష్కరించి వచ్చే ఏడాది జనవరి 5న తుది ఓటరు జాబితా ప్రకటిస్తారు. 2024 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారు కూడా ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఓటర్లందరూ తమ ఓటరు కార్డును ఆధార్ నెంబర్‌తో అనుసంధానం చేయటానికి ఫారం 6బి అందచేయాలని కలెక్టర్ తెలిపారు. కొత్తగా ఓటు నమోదుకు ఫారం-6, ఓటర కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయటానికి ఫారం-6బి, విదేశాలలో నివశిస్తున్న భారతీయ ఓటరు నమోదుకు ఫారం-6ఎ, ఓటరు తొలగింపునకు ఫారం-7, ఓటరు కార్డులో నమోదైన వివరాల మార్పునకు, చిరునామా మార్పునకు ఫారం-8 ఇవ్వాల్సి ఉంటుంది.