Apr 13,2023 00:25

మాట్లాడుతున్న రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య

ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకూ పొడిగింపునకు సమైక్యంగా పోరాటాన్ని ఉధృతం చేయాలని రైతు, ప్రజాసంఘాల రౌండ్‌టేబుల్‌ సమావేశంలో నాయకులు పిలుపునిచ్చారు. నిధుల కేటాయింపు డిమాండ్‌తో ఈ నెల 15న ఉదయం 10 గంటలకు గుంటూరు కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేయాలని సమావేశంలో తీర్మానించారు. బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో నల్లమడ రైతు సంఘం నాయకులు కుర్రా హరిబాబు అధ్యక్షతన రౌండ్‌టేబుల్‌ సమావేశం బుధవారం నిర్వహించారు. పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు, వివిధ రైతు సంఘాల నాయకులు పాల్గొని గుంటూరు ఛానల్‌ విస్తరణ ప్రాధాన్యతను తెలియజేస్తూ, పాలకులు నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ఆయా ప్రాంతాల భూములు ఉప్పునీటితో తడుపుకోవాల్సి వస్తుందని, ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే కాలంలో ఆప్రాంత భూములు సాగుకు పనికిరాకుండా పోయతాయని ఆందోళణ వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, విస్తరణ పనులు వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశాన్ని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు ప్రారంభించగా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ నీరున్న చోటే అభివృద్ధి ఉంటుందని, గుంటూరు ఛానల్‌ విస్తరణతో ఆప్రాంతంలోని 50 వేల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందుతుందని అన్నారు. సాగునీరు అందుబాటులో ఉంటే రైతులు రెండు, మూడు పంటలు వేసుకోవటానికి అవకాశం ఉంటుందని, ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే రూ.2.70 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో గుంటూరు ఛానల్‌ విస్తరణకు అవసరమైన రూ.274 కోట్లు విడుదల చేయటం పెద్ద సమస్య కాదని అన్నారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో అవసరమైతే ఆయా మండలాల్లోని గ్రామాల్లో బంద్‌ నిర్వహించటానికీ పోరాట కార్యాచరణ రూపొందించుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ గుంటూరు ఛానల్‌ విస్తరణకు పిడిఎఫ్‌ కూటమి మొదటి నుండి సానుకూలంగా ఉందని, అవకాశం ఉన్న అన్ని వేదికలపైనా తమ గళాన్ని వినిపిస్తున్నామని చెప్పారు. ఇటీవల ప్రభుత్వం కొద్దిమేర కదలిక వచ్చి, గుంటూరు జిల్లా కలెక్టర్‌ భూసేకరణకు నోటిఫికేషన్‌ ఇచ్చారని తెలిపారు. బాపట్ల జిల్లాలోని పర్చూరు మండలానికీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని బాపట్ల కలెక్టర్‌ను కోరారు. నోటిఫికేషన్‌ ఇచ్చినా అందుకు అవసరమైన రూ.113 కోట్లను బడ్జెట్‌లో కేటాయించలేదన్నారు. దీంతో భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగట్లేదన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో అతి సమీపంలోనే నదులు, రిజర్వాయర్లున్నా అనేక ప్రాంతాలు తీవ్రమైన నీటిఎద్దడి ఎదుర్కొంటున్నాయన్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి గుంటూరు ఛానల్‌ విస్తరణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో రైతు సంఘం బాపట్ల జిల్లా ఉపాధ్యక్షులు బండి శంకరయ్య, గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శివ, తెలుగు రైతు రాష్ట్రనాయకులు తాతిరెడ్డి లక్ష్మారెడ్డి, నల్లమడ రైతు సంఘం నాయకులు లావు నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.లక్ష్మణరావు, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎల్‌.అరుణ, కౌలు రైతు మువ్వా పెద్దన్న, పర్చూరు మండలం బూడవాడ సర్పంచ్‌ కె.బాపూజి, డివైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్‌ వై.కష్ణకాంత్‌, సిఐటియు నాయకులు కె.నళినీకాంత్‌ ప్రసంగించి మద్దతు పలికారు.
రాజకీయాలకు అతీతంగా పోరాటం
పాశం రామారావు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు.

నాటి కమ్యూనిస్టు నాయకులు కొల్లా వెంకయ్య కృషితో నల్లమడ రైతు సంఘం నాయకత్వంలో రాజకీయాలతో నిమిత్తం లేకుండా దశల వారీ ఐక్య ఉద్యమాల ద్వారా గుంటూరు ఛానల్‌ పొడిగింపు చర్చ విస్తృతంగా జరిగింది. ఛానల్‌ విస్తరణ పరిధిలో ఉన్న మండలాల్లోని ప్రజలను కదిలించి పెద్ద ఉద్యమాన్ని నిర్మించి గుంటూరు ఛానల్‌ పొడిగింపుకు నిధులు సాధించుకోవాలి.
బ్రిటీషు కాలం నుండి హామీలే
హరిబాబు, నల్లమడ రైతు సంఘం నాయకులు.

బ్రిటీషు కాలం నుండి గుంటూరు ఛానల్‌ విస్తరణకు పాలకులు హామీలే ఇస్తున్నారు. ఆచరణ రూపం దాల్చట్లేదు. ఈ ప్రాంత పంటలు పూర్తిగా వర్షాధారం పంటలు. గత టిడిపి, ప్రస్తుత వైసిపిలు కూడా నిధులు హామీలే ఇచ్చాయి. దీంతో విస్తరణ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. తక్షణమే పాలకులు స్పందించి, నిధులు విడుదల చేయాలి.
రైతు వ్యతిరేక విధానాలు విడనాడాలి
కళ్లం రాజశేఖర్‌రెడ్డి, తెలుగు రైతు అధ్యక్షులు

ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రైతుల సమస్యలపై రాజకీయాలకు అతీతంగా సంఘాలన్నీ ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. తెలుగు రైతు సంఘం గుంటూరు ఛానల్‌ విస్తరణకు పూర్తి మద్దతు ఇస్తుంది. రాబోయే ఎన్నికల్లో గుంటూరు ఛానల్‌ను విస్తరించే వారికే ఓటు అని ప్రజలు అనే విధంగా చైతన్యం రావాలి. ప్రస్తుత ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది. కనీసం కాల్వల్లో గుర్రపుడెక్క కూడా తొలగించట్లేదు.
పోరాటాన్ని ఉధృతం చేయాలి
మన్నవ హరిప్రసాద్‌, సిపిఐ (ఎంఎల్‌) రెడ్‌స్టార్‌ పొలిట్‌బ్యూరో సభ్యులు.

నల్లమడ వాగు, గుంటూరు ఛానల్‌ విస్తరణకు నల్లమడ రైతు సంఘం, ఇతర వామపక్షాలు సాగిస్తున్న సుదీర్ఘ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని గుంటూరు ఛానల్‌ విస్తరణకు పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలి. రాజకీయాలకు అతీతంగా సంఘాలన్నీ ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది.
ప్రజా పోరాటాలతోనే నిధులు
లావు అంకమ్మ చౌదరి, కాంగ్రెస్‌ రైతు సంఘం నాయకులు

రూ.రెండు లక్షలకు పైగా ఉన్న రాష్ట్ర బడ్జెట్‌లో వేలాది ఎకరాలకు సాగునీరు అందించే ఒక సాగునీటి ప్రాజెక్ట్‌ కోసం రూ.200 కోట్లు కేటాయించలేకపోవటం బాధాకరం. ప్రభుత్వం దిగి వచ్చేదాకా ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలి. ప్రజా పోరాటాలతోనే ప్రభుత్వం దిగి వస్తుంది.
పోరాటానికి సంపూర్ణ మద్దతు
కాల్వ శ్రీధర్‌, రైతు కూలి సంఘం నాయకులు.

గుంటూరు ఛానల్‌ విస్తరణకు సుదీర్ఘకాలంగా జరుగుతున్న ఉద్యమానికి తమ సంఘం తరపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో జరిగే ఉద్యమాల్లో రైతులకు అండగా పోరాటంలో పాల్గొంటాము.
సుదీర్ఘ పోరాటం స్ఫూర్తిదాయకం
కోటేశ్వరరావు, ఏరువాక రైతుకూలి సంఘం నాయకులు.

రైతుల సమస్యలపై దశాబ్ధాలుగా నల్లమడ రైతు సంఘం, వామపక్షాలు, రైతులు సుదీర్ఘ పోరాటం కొనసాగించటం స్ఫూర్తిదాయకం. నేటి తరం నాయకులు ఇదే స్ఫూర్తితో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలి.
ప్రజా ఉద్యమం నిర్మించాలి
నరిశేటి ఆచారి, నల్లమడ రైతు సంఘం నాయకులు.

ఛానల్‌ విస్తరణ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజల్ని ఐక్యం చేసి, ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో చైతన్యం తెచ్చి పోరాడాలి. దీనికోసం సంఘాలు, పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఏకం కావాలి.