ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించేందుకు ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించి, పనులు ప్రారంభించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబురావు డిమాండ్ చేశారు. బుధవారం బ్రాడిపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.నళినీకాంత్ అధ్యక్షతన ఆ పార్టీ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. బాబురావు మాట్లాడుతూ 60 ఏళ్ల నుండి గుంటూరు ఛానల్ పొడిగింపు కోసం ఆందోళన జరుగుతున్నా పాలకులు పట్టించుకోవట్లేదన్నారు. ఈ చానల్‌ను విస్తరిస్తే 50 గ్రామాలకు తాగునీరు, 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. ప్రభుత్వం నిధులు కేటాయించకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ప్రజల మధ్య విభజన సృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని విమర్శించారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన దేశంలో యునిఫాం కామన్ సివిల్ కోడ్ పేరుతో ప్రజల మధ్య విభజన రేఖ సృష్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల ఫలితంగా నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, ప్రజలకు సరిపడా ఉపాధి లేక జీవన ప్రమాణాలు తగ్గుతున్నాయని తెలిపారు. లాభాలు ఆర్జించే ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పోరేట్ సంస్ధలకు కేంద్ర ప్రభుత్వం అప్పగిస్తోందని విమర్శించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ ట్రూఅప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, స్థిర ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం భారాలు మోపిందని, పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో సుమారు 20 వేల కుటుంబాలు, ప్రభుత్వ భూముల్లో దీర్ఘకాలంగా నివాసముంటున్నాయని, వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరారు. కౌలు రైతులందరికీ యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా గుర్తింపు కార్డులిచ్చి, పంట రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.నేతాజి, ఇ.అప్పారావు, ఎస్‌ఎస్.చెంగయ్య, ఎం.రవి, నాయకులు ఎల్.అరుణ, బి.వెంకటేశ్వర్లు, ఎంఎ చిస్టీ పాల్గొన్నారు.










