Jun 28,2023 00:32

శశిభూషణ్‌కు వినతిపత్రం ఇస్తున్న ఎమ్మెల్సీ లక్ష్మణరావు, తదితరులు

ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు ఛానల్‌ని పర్చూరు వరకూ పొడిగించటానికి వెంటనే నిధులు విడుదల చేసి, పనులు ప్రారంభించాలని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు కోరారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కు లక్ష్మణరావు, గుంటూరు ఛానల్‌ సాధన సమితి నాయకులు నరిశెట్టి ఆచారి, నర్రా బాలకృష్ణ, కుర్రా హరిబాబు, కాకుమాను నాగేశ్వరరావు, దొప్పలపూడి రమేష్‌ తదితరులు వినతిపత్రం అందచేశారు. లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, పెదనందిపాడు, కాకుమాను మండలాలు, బాపట్ల జిల్లాలోని పర్చూరు మండలం మొత్తం ఐదు మండలాల్లోని 52 గ్రామాల్లో లక్ష మందికి తాగునీరు, 80 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని అక్కడి ప్రజలు 85 ఏళ్ల నుండి నుండి పోరాడుతున్నారన్నారు. ఈ ప్రాంతం నిత్యం కరువు వరదలకు గురవుతూ రైతుల్ని తీవ్రంగా నష్టపరుస్తోందని, పై నుండి వచ్చే కలుషిత నీరు వల్ల పంట భూములు, సౌడు భూములుగా మారుతున్నాయని తెలిపారు. పూర్తిగా వర్షంపై ఆధారపడిన ప్రాంతమని, బడ్జెట్లో నిధులు కేటాయించక పోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతుం దన్నారు. రెవెన్యూ అధికారులు గ్రామాల్లో పర్యటించి రైతుల నుండి వచ్చిన అభ్యంత రాలను కూడా స్వీకరించారని తెలిపారు. గుంటూరు ఛానల్‌ విస్తరణకు అవసరమైన భూసేకరణకు గుంటూరు, బాపట్ల జిల్లా కలెక్టర్లు ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేశారన్నారు. ప్రభుత్వం ఇప్పటికే గుంటూరు చానల్‌ విస్తరణకు అంగీకారం తెలిపినందున భూసేకరణకు అవసరమైన రూ.113 కోట్లను కేటాయించి, వెంటనే భూసేకరణ ప్రక్రియను, గుంటూరు ఛానల్‌ విస్తరణ పనులను చేపట్టాలని కోరారు. జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ మాట్లాడుతూ నిధులను కచ్చింతంగా విడుదల చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు.