ప్రజాశక్తి - ప్రత్తిపాడు : గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించేందుకు వెంటనే నిధులు కేటాయించకుంటే దశల వారీగా ఆందోళనకు పూనుకుంటామని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు హెచ్చరించారు. నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడులోని అక్షయ విద్యాలయంలో గుంటూరు ఛానల్ సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం సోమవారం నిర్వహించారు. సమావేశానికి రైతు నాయకులు కె.హరిబాబు అధ్యక్షత వహించగా లక్ష్మణరావు మాట్లాడుతూ గుంటూరు ఛానల్‌ను పొడిగిస్తే ఈ ప్రాంతలో వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని, ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను, వట్టిచెరుకూరు, పర్చూరు మండలాల్లో 50 గ్రామాలకు చెందిన 50 వేల ఎకరాల భూములుకు సాగునీరు అందడమే తాగునీరూ లభిస్తుందని వివరించారు. ప్రస్తుతం వర్షాధారంగా సాగు చేయడం వల్ల వ్యవసాయంలో నష్టాలు, ఎగుడుదిగుళ్లు వస్తున్నాయని, దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి భూ సేకరణకు రూ.113 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భూసేకరణకు గుంటూరు జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ ఇచ్చినా నిధులు విడుదల చేయక పనులు ప్రారంభం కాలేదన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ పర్చూరు మండలానికి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. 1936 నుండి పెదనందిపాడు హైలెవల్ ఛానల్ నిర్మించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని పాలక పార్టీలు వాగ్దానం చేస్తూనే ఉన్నాయని, 1946లో బ్రీటిష్ ప్రభుత్వం ప్లాన్ తయారు చేసిందని గుర్తు చేశారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబునాయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి గుంటూరు ఛానల్ పొడిగింపుకు నిధులు కేటాయిస్తామని వాగ్దానం చేసినా ఫలితం లేదన్నారు. ఆ ప్రాంత ప్రజలంతా ఐక్యంగా ఉద్యమిస్తేనే ప్రభుత్వంలో కదలిక వస్తుందన్నారు.
రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజరుకుమార్ మాట్లాడుతూ నాటి కమ్యూనిస్టు నాయకులు కొల్లా వెంకయ్య కృషితో నల్లమడ రైతు సంఘం నాయకత్వంలో రాజకీయాలతో నిమిత్తం లేకుండా దశల వారీగా ఐక్య ఉద్యమాలు చేయడం ద్వారా గుంటూరు ఛానల్ పొడిగింపు చర్చ విస్తృతంగా జరిగిందని చెప్పారు. ఈ ఐదు మండలాల్లోని ప్రజలను పెద్దఎత్తున కదిలించి ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పోరాటాల్లో రైతు సంఘం ముందు పిఠిన ఉంటుందని చెప్పారు. సమావేశంలో మాజీ ఎంపిపి ఎన్.బాలకృష్ణ, ఎన్.ఆచారి, జిడిసిసిబి మాజీ వైస్ చైర్మన్ కె.సుబ్బారెడ్డి, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు కె.శ్రీనివాసరావు, వివిధ సంఘాల నాయకులు కె.ఆదినారాయణ, బి.శంకరయ్య, ఎల్.అంకమ్మచౌదరి, వేణు, కె.నాగేశ్వరావు, సాంబశివరావు, బి.లక్ష్మణరావు, సిహెచ్.రమేష్, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.










