పెదనందిపాడు రూరల్: పార్టీల విభేదాలు మరచి రైతులంతా ఏకతాటి పై నిలిచి గుంటూరు ఛానల్ పొడిగింపు విషయంలో పోరాటానికి సిద్ధం కావాలని నల్లమడ రైతు సంఘం అధ్యక్షులు, గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగింపు పోరాట యోధుడు డాక్టర్ కొల్లా రాజ మోహన్ రావు పిలుపు నిచ్చారు. శుక్రవారం సాయంత్రం పెదనందిపాడు లో నల్లమడ రైతు సంఘ కార్యదర్శి వై.అంకమ్మ చౌదరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుంటూరు ఛానల్ పొడిగింపునకు నిధుల సాధన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఇప్పటి వరకు నిధులు మంజూరు చేయని, ఇచ్చిన హామీలు అమలు చేయని రాజకీయ నాయకుల హామీలతో విసుగు చెందామని అన్నారు. 50 వేల ఎకరాలకు సాగునీరు, 50 గ్రామాలకు తాగునీరు అందించే గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగింపు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందాన ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో రైతుల వద్ద సేకరించిన భూములకు నోటిఫికేషన్ ఇచ్చి నిధులు మంజూరు చేయకపోవడం శోచనీయమన్నారు. బాపట్ల జిల్లా పర్చూరులో కూడా ఇదే పరిస్థితి నెలకొందన్నారు . రైతులు వద్ద సేకరించిన పొలాలకు డబ్బులు ఇచ్చి నప్పుడే పనులు ప్రారంభమవుతాయన్నది అక్షర సత్యమన్నారు.
రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాదీశ్వరరావు సూచన మేరకు తాను హైద రాబాదులో ఏపీ నాబార్డ్ జనరల్ మేనేజర్ పి.జయ కన్నన్ కలసి గుంటూరు ఛానల్ పొడిగింపు నాబార్దు నిధులు మంజూరు చేయాల్సిందిగా వినతిపత్రం అందజేసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ఎన్నికలకు ముందు ఈ ప్రాంతా నికి పాద యాత్రలో భాగంగా వచ్చినప్పుడు కాకుమాను, పెద నందిపాడు, పత్తిపాడు, పర్చూరు మండలాల్లో ఈ ప్రాంత రైతుల ప్రధాన సమస్య అయిన గుంటూరు ఛానల్ పొడిగింపు పనులకు నిధులు సమకూర్చి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు పనుల విష యంలో కాలయాపన చేయటం పట్ల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఎన్నికల సమయం ఆసన్నమైందని ఇప్పుడే గుంటూరు ఛానల్ పొడిగింపు పనుల సాధనకు పోరాటం ఉధృతం చేయాల్సిన సమయమని, ఈ పోరాటాలకు తమ పూర్తి సహకారం అందజేస్తామని యువ రైతు సంఘ నాయకుడు కె. రాకేష్ ప్రకటించారు. మహిళా మండలి కార్యదర్శి ఈదర భ్రమరాంబ కొల్లా చిట్టెమ, మరి కొందరు మహిళా రైతులు మాట్లాడుతూ ఈ పోరాటంలో తాము అమరణ నిరాహార దీక్షలో అయినా పాల్గొనటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు లావు అంకమ్మ చౌదరి మాట్లాడుతూ ముఖ్యమంత్రికి ఈ ప్రాంత రైతులు సమస్యలు తెలిసి కూడా గుంటూరు ఛానల్ పొడిగింపు పనులకు రూ. 250 కోట్లు నిధులు మంజూరు చేయలేకపోవడాన్ని ప్రశ్నించారు. సమావేశంలో రైతు సంఘ నాయకులు బి. నాగేశ్వరరావు, ఎం.రాఘవయ్య, కె.రామన్, పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన రైతు సంఘం నాయకులు తమ సలహాలను సూచనలను అందజేశారు. తమ సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టాలని సమావేశం నిర్ణయించింది.










