Aug 28,2023 23:44

మాట్లాడుతున్న రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య

ప్రజాశక్తి - పెదనందిపాడు రూరల్‌ : అఖిలపక్ష గుంటూరు ఛానల్‌ సాధన సమితి ఆధ్వర్యంలో వచ్చేనెల 17న మండల కేంద్రమైన పెదనందిపాడులో సదస్సును నిర్వహించనున్నట్లు నాయకులు ప్రకటించారు. ఈ మేరకు స్థానిక తేళ్ల నారాయణ విజ్ఞాన కేంద్రంలో సోమవారం నిర్వహించిన సమావేశానికి సాధన సమితి కన్వీనర్‌ ఎన్‌.ఆచార్యులు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ గుంటూరు ఛానల్‌ పొడిగింపు కేవలం రైతుల సమస్య మాత్రమే కాదని వ్యవసాయం మీద ఆధారపడిన రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు సమస్య కూడా అని తెలిపారు. ఈ ప్రాంతంలో అనేక గ్రామాలకు తాగునీరు, వాడుకోవడానికి నీరు పెద్ద సమస్యగా మారిందని, గుంటూరు ఛానల్‌ విస్తరణతో ఆ సమస్య తీరుతుందని చెప్పారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.అజరుకుమార్‌ మాట్లాడుతూ సుదీర్ఘకాలం నుండి ఈ ప్రాంతంలో గుంటూరు ఛానల్‌ పొడిగింపు కోసం పోరాటం జరుగుతోందని, ప్రభుత్వం వెంటనే భూసేకరణకు నిధులు కేటాయించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు.
26, 27, 28 తేదీల్లో రాజ్‌ భవన్‌ల ఎదుట ధర్నా
అనంతరం కృష్ణయ్య విలేకర్లతో మాట్లాడుతూ ఢిల్లీలో ఈనెల 24న జరిగిన కార్మిక, కర్షక ఐక్య సదస్సు తీర్మానాలను వివరించారు. ధరల పెరుగుదలను నియంత్రించాలని, ఉపాధి హామీ చట్టానికి నిధులు పెంచాలని, రైతులకు విత్తనాలు, ఎరువులు, విద్యుత్‌ సబ్సిడీని ఇవ్వాలని, అన్ని పంటలకు కనీస మద్దతు ధరల చట్టం తేవాలని, పంటను ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల దగ్గర నుంచి కొనాలని, నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ తీర్మానాలను ఆమోదించినట్లు తెలిపారు. నవంబర్‌ 26, 27, 28వ తేదీల్లో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రాజ్‌ భవన్‌ల ఎదుట రాత్రి, పగలు ధర్నా చేయాలని, లకీంపూర్‌కేరి ఘటనలో రైతుల మరణానికి కారకులైన హోంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రాను మంత్రివర్గం నుండి తొలగించేందుకు పోరాటం చేయాలని తీర్మానించినట్లు తెలిపారు. సమావేశాల్లో అఖిలపక్ష గుంటూరు ఛానల్‌ సాధన సమితి కో-కన్వీనర్లు ఎన్‌.బాలకృష్ణ, కె.హరిబాబు, బి.శంకరయ్య, పి.వేణు, కె.వెంకటశివరావు, సాధన సమితి సభ్యులు డి.రమేష్‌బాబు, ఎం.వెంకటేశ్వర్లు, జె.రామారావు, కె.శివనాగేశ్వరరావు, సిహెచ్‌.యానాదులు, ఆర్‌.వినోద్‌, ఎం.రమణ, కె.శేషయ్య పాల్గొన్నారు.