
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు నగరం ఆటోనగర్‌లోని ప్లాస్టిక్ వస్తువులు తయారు చేసే కంపెనీలో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవిచింది. షార్టు సర్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థపదార్థాలను కొనుగోలు చేసి నిల్వ చేసి పిల్లెట్స్ (ప్లాస్టిక్ బాల్స్) తయారు చేసే ఈ కంపెనీలో చాలా కాలంగా నిల్వలు పేరుకుపోయాయి. అగ్ని ప్రమాదంలో ప్లాస్టిక్ వ్యర్ధపదార్ధాలు భారీగా దగ్ధమవడంతోపాటు కంపెనీ ముందు ఉన్న ఒక కారు కూడా కాలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు లేచాయి. గాలి ఎక్కువగా ఉండటంతో కొద్దిసేపు మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. నష్టం దాదాపు రూ.4 లక్షల వరకు ఉంటుందని అంచనా. పెదకాకాని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.