నాణ్యమైన విద్యుత్ తక్కువ ధరకు అందించేందుకు ప్రయత్నం : ఎంఎల్‌ఎ వాసుబాబు
ప్రజాశక్తి - భీమడోలు
రానున్న కాలంలో అవసరాలకు సరిపడా నాణ్యమైన విద్యుత్‌ను తక్కువ ధరకు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందని ఉంగుటూరు ఎంఎల్‌ఎ పుప్పాల వాసు బాబు తెలిపారు. గుండుగొలనులో రూ.3.50 కోట్ల వ్యయంతో నిర్మించిన 5 ఎంవి సామర్థ్యం గల 33/11-కెవి విద్యుత్ ఉప కేంద్రాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు తూర్పు ప్రాంత విద్యుత్ సరఫరా సంస్థ ఏలూరు ఎస్‌ఇ సాల్మన్‌రాజు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంఎల్‌ఎ మాట్లాడుతూ ప్రభుత్వం తక్కువ ధరకు విద్యుత్ అందించే క్రమంలో సోలార్, విండ్(గాలి మరలు), రీ రెన్యూబుల్ విధానాలలో విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ తరహా విద్యుత్ సరఫరా విధానం అమల్లోకి వచ్చిందన్నారు. విండ్, సోలార్ విధానం ద్వారా పదివేల మెగావాట్ల విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేశామన్నారు. ఉంగుటూరు నియోజకవర్గ విషయానికి వస్తే నియోజకవర్గ పరిధిలో విద్యుత్ సరఫరా సమస్యలు తీర్చేందుకు, నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. దీనిలో భాగంగా ప్రస్తుతం గుండుగొలనులో ప్రారంభించిన తరహాలోనే నిడమర్రులో ఇదే సామర్థ్యం ఉన్న విద్యుత్ కేంద్రానికి రెండు రోజుల్లో ప్రారంభోత్సవం చేయనున్నామన్నారు. ఇదేవిధంగా గణపవరం, కేశవరం, తోకలపల్లి, రాచూరులో విద్యుత్ ఉప కేంద్రాల పనులు ప్రారంభం కానున్నయని, ఇదే తరహాలో మరొక నాలుగు విద్యుత్ కేంద్రాల నిర్మాణాలకు అనుమతులు లభించాయన్నారు. ఇదే క్రమంలో వీటన్నింటికీ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు భీమడోలు తరహాలోనే గణపవరం కేంద్రంగా 132/33/11 కెవి సామర్థ్యం ఉన్న విద్యుత్ కేంద్రాన్ని రూ.120 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నామని తెలిపారు. దీనికోసం ఇప్పటికే ప్రెయివేటు స్థలాన్ని కొనుగోలు చేసామన్నారు. మెరక చేసే పనులు కొనసాగుతున్నాయన్నారు. గుండుగొలనులో ఇప్పటికే ఉన్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి రూ.60 లక్షల వ్యయంతో 15 ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. తాజాగా నిర్మిస్తున్న విద్యుత్ ఉపకేంద్రం వల్ల గుండుగొలను, దాని పరిసర ప్రాంతాలకు విద్యుత్ సమస్యలు శాశ్వతంగా దూరమవుతాయన్నారు. వీటన్నింటికీ తోడు జగనన్న కాలనీలతో పాటు ఇతర కాలనీలకు విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎస్‌ఇ సాల్మన్ రాజు మాట్లాడుతూ గుండుగొలను కేంద్రంగా విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణంతో దశాబ్దాలుగా విద్యుత్ సమస్య ఎదుర్కొంటున్న గుండుగొలను, దాని పరిసర ప్రాంతాల వారికి విద్యుత్ సమస్యలు తీరనున్నాయన్నారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కేంద్ర ప్రభుత్వం ఆర్‌డిఎస్‌ఎస్ పథకం కింద రూ.400 కోట్లు మంజూరు చేసిందని, దీనిలో భాగంగా కొన్ని పనులు జిల్లాలోను, ఉంగుటూరు నియోజకవర్గంలోనూ చేపట్టనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఇఇ శశిథర్, డిఇ వెంకటేశ్వరరావు, భీమడోలు ఎడిఇ గోపాలకృష్ణ, గ్రామ ఉపసర్పంచి ముదిండి సూర్యనారాయణ, ఎంపిపి కనుమాల రామయ్యతో పాటు పలువురు మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.










