May 19,2023 00:57

తాడేపల్లిరూరల్‌: ఎంటిఎంసి పరిధిలోని గుండిమెడలో గురువారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇసుక క్వారీలో అక్రమ తవ్వకాలు ఆపాలని నిరసన కార్యక్రమం జరిగింది. బుధవారం స్థానిక రైతులు ఇసుక క్వారీ నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఆందోళన చేసిన క్రమంలో గురువారం జనసేన పార్టీ నాయకులు గుండె మెడ ఇసుక క్వారీని పరిశీలించారు. జనసేన కార్య కర్తలు పెద్ద సంఖ్యలో క్వారీ దగ్గరికి చేరుకున్నారు. దీంతో సమాచారం అందుకున్న తాడేపల్లి మండల సీఐ శేషగిరిరావు, పోలీసులు గుండిమెడ ఇసుక క్వారీ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గుండిమెడ ఇసుక క్వారీ గడువు ముగిసిన కూడా తవ్వకాలు ఆపడం లేదని అన్నారు. సీఎం నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న ఇసుక క్వారీలో అక్రమాలు జరుగుతున్న కూడా అధికారులు పట్టించుకోవడంలేదని అన్నారు. జె పి గ్రూప్‌ పేరుతో అక్రమ తవ్వకాలు చేస్తు న్నారని ఆయన ఆరోపించారు. ఇసుకను దోచుకొని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. అదేవిధంగా భవిష్యత్తు తరాల ఆస్తిని దోచుకుంటే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ను ప్యాకేజీ తీసుకుంటున్నారని విమర్శించిన వైసిపి నాయకులు, ఏ ప్యాకేజీలు తీసుకుని వైసీపీ నాయకులు అక్రమ ఇసుక తరలిస్తున్నారో చెప్పాలన్నారు. ఇసుక క్వారీలలో అక్రమ తవ్వకాలు ఆపకపోతే రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. అనంతరం పోలీసులను కలిసి, క్వారీ లో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను ఆపాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ మంగళ గిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్జి చిల్లపల్లి శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజరు శేఖర్‌, జిల్లా కార్యదర్శి రావి రమ,తాడేపల్లి మండల జనసేన అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, ఎర్రబాలెం గ్రామ కార్యదర్శి కాపరవుతూ సుందరయ్య పాల్గొన్నారు.